తిరుపతి : తిరుమల నడక దారిలో చిరుతల దాడిపై అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్ర రెడ్డి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ చిరుత దాడులు
జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల చిరుత దాడిలో మృతి చెందిన
చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించామని,
జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. మ్యాన్ ఈటర్‌గా మారిన రెండు చిరుతలను జూ
పార్క్‌లోనే ఉంచుతామని చెప్పారు. శాశ్వత ప్రాతపదికన కంచే ఏర్పాటు చేసే దిశగా
టీటీడీ, అటవీ శాఖలు ఆలోచన చేస్తోందని తెలిపారు. టీటీడీ పరిధిలోని
అటవీప్రాంతంలో సంఘటన జరిగిందని, ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో టీటీడీకి
సహకరిస్తామన్నారు. టీటీడీ దేవస్థానం నివేదిక వచ్చిన తర్వాత ఢిల్లీలో అటవీ
డైరెక్టర్ జనరల్ అనుమతి తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.