తెలంగాణాలో అధికార బీఆర్ఎస్ 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ 18-21 వరకు లోక్ సభ స్థానాలు
జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ సర్వే వెల్లడి
హైదరాబాద్ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు
చెందిన అభ్యర్థులే ఎక్కువ సీట్లు సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా
కనిపిస్తున్నాయి. అధికార పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు సర్వేల్లో వెల్లడి
కావడంతో ఆ పార్టీల నేతల్లో మరింత జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో, ఏపీలో వచ్చే
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఇప్పుడున్న అధికార పార్టీలే గెలుచుకుంటాయి.
అంటే తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకొని
ఆధిక్యం సాధిస్తాయి. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ సర్వే
వెల్లడించింది. తెలంగాణ విషయానికొస్తే లోక్సభ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 9
నుంచి 11 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీకి తెలంగాణలో 2-3 సీట్లు,
కాంగ్రెస్ కు 3-4 సీట్లు, ఇతరులకు ఒక సీటు వస్తుందని సర్వేలో తేల్చింది.
బీఆర్ఎస్ కు 38.40 శాతం మంది ప్రజల మద్దతు ఉందని చెప్పింది. బీజేపీకి 24.30
శాతం, కాంగ్రెసుకు 29.90 శాతం, ఇతరులకు 7.40 శాతం మేర ఓట్లు వస్తాయని
వెల్లడించింది. దీని ద్వారా మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతుగా
నిలుస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు
సాధిస్తామని సీఎం కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్
తెలంగాణలో సీన్ మారిందని, ప్రజలు తమ వైపే ఉన్నారని ప్రచారం చేస్తోంది. కొద్ది
రోజుల క్రితం వరకు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయ పోరు
సాగింది. కానీ, అనూహ్యంగా బీజేపీ లో అంతర్గత సమస్యల కారణంగా
వెనుకబడింది.ఇప్పుడు కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ గా ఎన్నికల యుద్దం మారినట్లు
కనిపిస్తోంది. అదే విషయం ఇప్పుడు ఈ సర్వేలోనూ స్పష్టం అవుతోంది. బీఆర్ఎస్ తొలి
స్థానంలో నిలవగా, కాంగ్రెస్ తరువాతి స్థానంలో ఉంది. కాంగ్రెస్ తెలంగాణలో
బీజేపీ కంటే మెరుగైన స్థానంలో కొనసాగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హోరా హోరీ పోరు తప్పదనే అంచనాలు వ్యక్తం
అవుతున్నాయి.
ఇక ఏపీ విషయానికి వస్తే ఏప్రిల్లో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీ
ఏకపక్షంగా విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ప్రకటించింది. తిరిగి, జూన్ 15-
ఆగస్టు 12వ తేదీ మధ్య తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలోనూ అవే ఫలితాలు
పునరావృత మయ్యాయని తెలిపింది. ఏప్రిల్లో జరిగిన సర్వే, తాజా సర్వే ఫలితాల
మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఆ తేడా జాతీయ స్థాయి
ఫలితాల్లోనే కనిపించింది. ఏపీకి సంబంధించి గతంలో మాదిరిగానే 24 నుంచి 25 ఎంపీ
స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందని తేలింది. 2019 ఎన్నికల్లో
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది.
ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నౌ
సర్వే తేల్చింది. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం
1.50 శాతం పెరుగనున్నట్లు స్పష్టమవుతోంది. ఓట్ల శాతంలో వైసీపీకి 51.30 తో
సగానికి పైగా ఓటింగ్ షేర్ సొంతం చేసుకుంటుందని అంచనా వేసింది. టీడీపీకి 36.20
శాతం, జనసేనకు 10.10 శాతం, బీజేపీకి 1.30 శాతం ఓటింగ్ షేర్ దక్కుతుందని
వెల్లడించింది. గత కొద్ది నెలల కాలంలో పలు జాతీయ సర్వే సంస్థలు ఇవే తరహా
అంచనాలను వెల్లడించాయి. వైసీపీ 18-21 వరకు లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని
చెప్పుకొచ్చాయి. ఇప్పుడు తాజా సర్వే లోనూ టైమ్స్ నౌ ఇదే అంశాన్ని స్పష్టం
చేసింది. ఇదే సమయంలో లోక్ సభలో ప్రస్తుతం నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న
వైసీపీ తాజా అంచనాల మేరకు బీజేపీ, కాంగ్రెస్ తరువాత మూడో స్థానానికి
చేరుకుటుందని సర్వేలో విశ్లేషించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు
వస్తాయని చెబుతున్నారు.