యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి
33 ఏళ్లకు లీజుకు భూమి.. ఆ తర్వాత పెంచుకోవచ్చు
ఏపీఐఐసీ భూ కేటాయింపులపై నూతన మార్గదర్శకాలు జారీ
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)
అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం,
ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన
విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక
పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ
కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్
అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు
వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు.
తాజా మార్గదర్శకాల ప్రకారం పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్
ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15
శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి
కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం
తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు
20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు.
ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10
ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు
కల్పిస్తారు.
వివిధ కంపెనీలకు భూకేటాయింపులు : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో
భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు
జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న
రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే
లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి
వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం
జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో
హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి
కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన
విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో
శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్
యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు
వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది.