కృష్ణారావు మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం
అమరావతి : సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస
విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు గురువారం
కన్నుమూశారు. కాగా, అనలిస్ట్‌గా నిక్కచ్చిగా వ్యవహరించారు కృష్ణారావు. ఆయన
రాజకీయ వర్గాల్లో బాబాయ్‌గా సుపరిచితులు. సీహెచ్‌వీఎం కృష్ణారావు మృతిపట్ల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘ తెలుగు,
ఇంగ్లీషు జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారు. కిందిస్థాయి నుండి
మంచి జర్నలిస్టుగా ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణారావు. కృష్ణారావు
కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్ సంతాపం తెలిపారు. మరోవైపు
ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ
మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కూడా కృష్ణారావు మృతికి సంతాపం తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ
కృష్ణారావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం
ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన
సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల
కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన
రేకెత్తించేవిగా ఉండేవని సీఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం
రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా
రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని
కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
సన్నిహితులు ప్రేమగా ‘బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్
సంపాదకులు కృష్ణారావుమృతి బాధాకరం. కృష్ణారావు 47 ఏళ్లుగా పత్రిక రంగంలో వివిధ
హోదాల్లో పనిచేసి, జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా రంగానికి
తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని
తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రగాఢ సానుభూతి : ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్
సంపాదకులు సిహెచ్ విఎం కృష్ణారావు మృతి పట్ల ఏపీ బీసీ సంక్షేమం, సమాచార, పౌర
సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ప్రగాఢ సంతాపం
వ్యక్తం చేశారు. ‘ దాదాపు 5 దశాబ్దాలుగా పత్రిక రంగంలో, రాజకీయ విశ్లేషణలో
తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు. 18 ఏళ్ల పాటు
డెక్కన్ క్రానికల్ దిన పత్రికలో బ్యూరో చీఫ్ గా ఆయన సేవలు ఎనలేనివి. ఆయన
ప్రతిభ అసామాన్యమైనదని తన సానుభూతి తెలిపారు. ప్రత్యేకంగా టీవీ డిబేట్లలో
నిర్మాణాత్మక రాజకీయ విశ్లేషణలు చేయడంలో ఆయనకు ఆయనే సాటని, ఎందరో యువ
జర్నలిస్టులకు కృష్ణారావు జీవితం ఆదర్శణీయమన్నారు.
సిహెచ్ ఎంవీ కృష్ణారావు మృతికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం : ప్రముఖ
పాత్రికేయుడు, సంపాదకులు సిహెచ్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల మంత్రి
ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను
కలిచి వేసిందని పేర్కొన్నారు. సుధీర్ఘ కాలంగా కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని
ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. జర్నలిజంలో కృష్ణారావు చేసిన
సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ
సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు సద్గతులు
కలగాలని ప్రార్థించారు.