ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : ఎందరో మహాత్ములు, కాంగ్రెస్ వాదులు తమ జీవితాలను త్యాగం చేసిన
ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని ఏపీ కాంగ్రెస్
ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్నభవన్ లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా
మంగళవారం గిడుగు రుద్రరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు
దేశ ప్రజలందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాతంత్య్రా లకు ప్రధాన కారణం గాంధీ,
నెహ్రూలతో పాటు ఎందరో త్యాగధనులని కొనియాడారు. గుండు సూదిని కూడా తయారు
చేయలేని స్థితి నుంచి రాకెట్ తయారీలతో అంతరిక్షాన్ని కూడా శాసించే స్థాయికి
నేడు భారతదేశం చేరడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఎందరో
ప్రధాన మంత్రులు చేసిన అభివ్రుద్దే అని గిడుగు రుద్రరాజు ఈ సందర్బంగా గుర్తు
చేశారు.
రాహుల్ ప్రధాని కావడం అత్యావశ్యకం
దేశంలో నేడు నెలకొన్న పరిస్థితులు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని పీసీసీ చీఫ్
గిడుగు రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ వ్యవహార శైలి దెయ్యాలు, వేదాలు
వల్లిస్తున్నట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్
గాంధీ ప్రధాని కావడం దేశానికి అత్యావశ్యకమని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ,
బీసీ, మైనారిటీలకు న్యాయం జరగాలన్నా, వారికి సంక్షేమ, అభివ్రుద్ది ఫలాలు
అందాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావడంతోనే సాధ్యమని తేల్చి చెప్పారు. అదే
విదంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేళ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రులు
టంగుటూరి ప్రకాశం, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డిలతో పాటు జాతీయ
జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, కాశీనాధుని నాగేశ్వరావు, వావిలాల
గోపాలక్రిష్టతో పాటు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల సేవలను కొనియాడుతూ వారికి
నివాళులు అర్పించారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో : యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య
దినోత్సవేడుకలను వినూత్నంగా నిర్వహించారు. విజయవాడ, పాయికాపురంలోని ప్రభుత్వ
కళాశాలలో పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు దగ్గర ఉండి విద్యార్థినులతో జెండాను
ఆవిష్కరింపజేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతపరమైన నిర్ణయాలలో భాగంగానే
మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన రుద్రరాజు, విద్యార్థినులతో
జెండా పండుగను నిర్వహించడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపారు. రాష్ట్ర
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో రాష్ట్ర కార్యనిర్వహక
అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్ యలమందారెడ్డి,
కార్యదర్శి ఎండీ గౌస్, రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ వి.గుర్నాధం, వైస్ ఛైర్మన్
డాక్టర్ జంధ్యాల శాస్త్రి, విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
నరహరిశెట్టి నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బుర్రా కిరణ్ కుమార్,
ఏఐసీసీ సభ్యులు కొలనుకొండ శివాజీ, ధనేకుల మురళి, మేడా సురేష్, మీసాల
రాజేశ్వరరావు, ఖాజా మోహిద్దీన్, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాంతియా
కుమారి, సీనియర్ నాయకులు పి.నాంచారయ్య, బైపూడి నాగేశ్వరావు, గంగిశెట్టి
అయ్యప్ప, వేముల శ్రీనివాస్, పివై కిరణ్, ఖుర్షిదా, అన్సారీ, పి.ఏసుదాసు, యూత్
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసఫ్, జిల్లా ఇన్ఛార్జ్ బోళ్ల పవన్
కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.సందీప్ తో పాటు పలువురు
నాయకులు పాల్గొన్నారు.