గాజువాక నా నియోజకవర్గం జగన్ కు గెలుపు ఇచ్చి నాకు ఓటమిని ఇచ్చింది: పవన్
కల్యాణ్
గాజువాకలో పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ
జగన్ దోపిడీదారుడు అని తెలిసి కూడా గత ఎన్నికల్లో నమ్మారు
ఇదే గాజువాకలో తనకు ఇవాళ అఖండ స్వాగతం లభించిందన్న పవన్
విశాఖపట్నం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాజువాకలో నిర్వహించిన
భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గాజువాక తన
నియోజకవర్గం అని వెల్లడించారు. ఒక ఆశయంతో ఈ నియోజకవర్గంలో పోటీ చేశానని, కానీ
దోపిడీ చేస్తాడు అని తెలిసి కూడా ఈ నియోజకవర్గం జగన్ కు గెలుపును ఇచ్చి, తనకు
ఓటమిని ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఇదే గాజువాక నియోజకవర్గంలో తనకు
ప్రజల నుంచి అఖండ స్వాగతం లభించిందని, తాను ఇక్కడ ఓడిపోయిన విషయం తెలియనంత
గొప్ప స్వాగతం లభించిందని, ఇంతటి ప్రేమను తాను ఊహించలేదని అన్నారు. భవన
నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో సభ అంటే భయపడ్డానని, కానీ 2 లక్షలకు పైగా జనం
వచ్చి, ఆశయంతో ఉన్న వాడికి గెలుపోటములు అతీతం అని నిరూపించేలా నిలబడ్డారని
పవన్ కల్యాణ్ కొనియాడారు. 2024లో గాజువాకలో గెలిచేది జనసేన పార్టీయేనని ఢంకా
బజాయించారు. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందని ఆ పార్టీ
అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి మూడో విడత యాత్రలో భాగంగా ఆదివారం
గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఇక్కడి ప్రజాదరణ
చూస్తుంటే గాజువాకలో తాను ఓడిపోయినట్టు భావించడం లేదన్నారు. పోరాటం ఎలా చేయాలో
ఉత్తరాంధ్ర నేర్పించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి గుండెకాయ
లాంటిది. ఎంతో మంది బలిదానాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు. స్టీల్ ప్లాంట్ కోసం 26వేల ఎకరాలు ఇచ్చారు. స్టీల్
ప్లాంట్‌కు భూమి ఇచ్చిన వారిలో ఇంకా సగం మందికి పరిహారం రాలేదు. ప్రాజెక్టులు,
పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారు రోడ్డున పడ్డారు. ప్రజల కోసం నిలబడలేని
వాళ్లు రాజకీయాల్లోకి రావొద్దు. 2018లో ఇక్కడి వైకాపా ఎంపీపై రౌడీషీట్ ఉంది.
ఇలాంటి వారిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకుంటే స్టీల్ ప్లాంట్ కోసం
పోరాడగలరా? కేసులున్న వాడికి ధైర్యం రాదు. వైకాపా నేతలకు పార్లమెంట్లో
ప్లకార్డు ప్రదర్శించే దమ్ముందా? నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడేవారికే ధైర్యం
ఉంటుంది. ఉత్తరాంధ్ర, విశాఖ కోసం దిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటా. ఆంధ్రా
ఎంపీలంటే ఢిల్లీలో చులకన భావన ఉంది. వీళ్లంతా వ్యాపారాల కోసమే పదవులను
వాడుకుంటారని వారికి తెలుసు. జనసేన తరపున ఎంపీ లేకపోయినా స్టీల్ ప్లాంట్
ప్రైవేటీకరణ చేయొద్దని అమిత్ షాకు చెప్పా. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను
పరిశ్రమగా చూడొద్దు. భావోద్వేగాలతో కూడుకున్నదని వివరించానని పవన్ కల్యాణ్
తెలిపారు. ప్రజల మద్దతు లేకపోతే నేనేం చేయలేను. స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యేక
దృష్టి సారించాలని కేంద్రాన్ని కోరా. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్క ఎంపీ
కూడా విశాఖ స్టీల్‌కు సొంత గనులు కేటాయించాలని అడగలేదు. స్టీల్‌ప్లాంట్‌కు
సొంత గనులు కేటాయించాలని ఢిల్లీ పెద్దలకు చెప్పా. ఏ పదవీ లేని నేనే ప్రధాని,
హోం మంత్రి వద్దకు వెళ్తున్నా. స్వార్థం లేకుండా ఉంటే ప్రధాని, హోం మంత్రి
అన్నీ వింటారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి. ప్రజల మద్దతు లేకుంటే
నేనేం చేయలేను. గంగవరం పోర్టు వద్ద పోలీసు కాల్పుల్లో మత్స్యకారుడు చనిపోయారు.
కానీ, పోర్టు నిర్వాసితులకు ఇంకా న్యాయం చేయలేదు. గంగవరం పోర్టు కార్మికుల
సమస్యలు పరిష్కరా? ఆస్తులు అమ్ముకునేందుకా ప్రజలు మిమ్మల్ని సీఎంగా
ఎన్నుకున్నది. జగన్‌ను మరో 6 నెలలు ప్రజలు భరించాలి. విప్లవకారుడు రాజకీయ
నాయకుడైతే ఎలా ఉంటుందో రోజూ చూపిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.