కల్లబొల్లి కబుర్లకు మోసపోయే జనం లేరిక్కడ!
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : వ్యవసాయం అంటే దండగ అన్న చంద్రబాబు మళ్లీ మాటలగారడీతో ప్రజల్ని
మభ్యపెట్టే వ్యూహంతో వచ్చారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం అంటే దండగ అని
చెప్పే చంద్రబాబు ఇప్పుడు ప్రాజెక్టులపై ప్రేమ వలకబోస్తున్నారని అన్నారు.
నిన్న శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆయన పూర్తిగా వాస్తవాలను కప్పిపుచ్చి
మరోసారి కల్లబొల్లి కబుర్లకు దిగారన్నారు. ఎన్నికలు జరిగే ముందు ప్రతిసారి
ఇలాగే ప్రజలను వంచించడం చంద్రబాబుకు అలవాటు అని వ్యాఖ్యానించారు. ఈ జిల్లా
రైతాంగంపై మాటల్లోనే అంత ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్న
నాడే వంశధారను పూర్తి చేయాలి కదా? అని ప్రశ్నించారు. వంశధారను ప్రారంభించిందే
వైఎస్సార్. 60% పనులు పూర్తి చేసింది వైయస్సారే అని అన్నారు. ఇది చారిత్రక
వాస్తవమని చెప్పారు. ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి మహానేత ఆశయాలను,
కలలను సాకారం చేసేది మా సీఎం జగన్ మాత్రమే నని అన్నారు. మహేంద్రతనయ పై ఆఫ్
షోర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించింది వైయస్సార్ అని గుర్తుచేశారు. మీ హయాంలో
ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం వాస్తవం కాదా అని
ప్రశ్నించారు. ఇప్పుడు రూ.840 కోట్లతో రివైజ్డ్ శాంక్షన్ చేసి టెండర్లను
అధికారులు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. వంశధార- నాగావళి అనుసంధాన పనులు
కనీసంగా 30 శాతం కూడా టీడీపీ ప్రభుత్వం చేయలేదు. అప్పుడు గాలికి వదిలేసి
ఇప్పుడు ఫోటోలు దిగుతోందని ఎద్దేవా చేశారు. జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై
పచ్చ మీడియాలో రాయించే మతిలేని రాతలని వివేకమున్న ఎవరూ నమ్మడం లేదన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏటీఎంలా మీరు వాడుకున్నట్లు ప్రధాని మోదీయే చెప్పిన
వైనం గుర్తు లేదా బాబు? అంటూ ప్రశ్ణించారు. పోలవరం పనుల్లో వేగం పెంచేలా
చేసిన సీఎం వైయస్ జగన్ మాత్రమే నని అన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి
పులిచింతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కండలేరు, గోరకు అవుకు రియర్వాయర్లలో
గరిష్ట నీటి నిల్వలు సాధ్యం చేశారన్నారు.2019 నుంచి ఏటా సగటున కోటి ఎకరాలకు
సాగు నీటి సరఫరా జరుగుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మంజూరు చేసిన
ఘనత వైయస్సార్ ది అని చెప్పారు. వైయస్ జగన్ హయాంలో రూ. 1700 కోట్లతో
ప్రాజెక్టు శాంక్షన్ చేసి వేగంగా భూ సేకరణ చేయిస్తున్నారని తెలిపారు. డిజైను
పూర్తి అవుతున్నదని మిగిలిన పనులు రెండు ప్యాకేజీలుగా చేసి జగన్ ప్రభుత్వం
పనులు చేపట్టిందని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి కూడా ఈ ప్రాజెక్టు
కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్
హయాంలోనే 95 శాతం పూర్తి అయితే తన ఘనతగా చెప్పుకుని చంద్రబాబు చంకలు
గుద్దుకుంటున్నారన్నారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టూ పూర్తి చేయని బాబు అధిక
ప్రసంగంతో ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. జలయజ్ఞంలో 40 ప్రాజెక్టుల్లో
మిగిలిన పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని చంద్రబాబు 2014లో హామీ
ఇచ్చి దానికి రెండున్నర రెట్లు అధికంగా ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టూ
పూర్తి కాలేదన్నారు. జీవో 22, 63లను అడ్డంపెట్టి చంద్రబాబు నిధులను
దోచుకున్నారని అన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్లోనూ కమీషన్లు వసూలు చేసుకుని,
చంద్రబాబు అతని అనుచరులు చేతులెత్తేసిన వైనం తెలియంది కాదన్నారు. తప్పులు చేసి
వేళ్లన్ని తన వైపే చూపుతున్న, కంప్యూటర్ గ్రాఫిక్స్ లతో ప్రజల్ని ఏమార్చి మాయ
చేయడం బాబుకే సొంతం. ప్రజలంతా అతని వేషాలు గమనిస్తున్నారన్నారు. మంచి
చేస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని ప్రజలు తెలుసుకుంటున్నారని
ధర్మాన కృష్ణదాస్ వివరించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ రాష్ట్రానికి సుపరిపాలన
అందిస్తున్న సీఎం జగన్ ని సైకో సీఎం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు.
ఏంపీగా ఉంటూ రామ్మోహన నాయుడు ఈ జిల్లా లోని ప్రజల సమస్యలు ఏనాడీనా
పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి
వచ్చి సొంతంగా ఒక్కపనీ చేయలేని రామ్మోహన నాయుడు సీఎం జగన్ నే విమర్శించడం అతని
అహంభావానికి నిదర్శనమన్నారు. రూ. వేల కోట్లతో ఈ జిల్లాలో జరిగిన, జరుగుతున్న
అభివృద్ధిపనులు అతని కళ్లకు కనిపించడం లేదని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు.