విజయవాడ : వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటడాన్ని ప్రతీ పౌరుడు తన
సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ తోటవారి వీధిలో నగర డిప్యూటీ
మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి మంగళవారం మొక్కలు నాటు కార్యక్రమంలో ఆయన
పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మానవాళి మనుగడ పచ్చదనం
పరిఢవిల్లితేనే సాధ్యమవుతుందన్న విషయాన్ని బాధ్యతగల పౌరులందరూ గ్రహించాలని
కోరారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ
సరైన మార్గంలో ముందుకు సాగుతుందన్నారు. మొక్కలు నాటడంతో భారీ ఉష్ణోగ్రతలను
నియంత్రించవచ్చని.. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ ఆవశ్యకత ప్రతిఒక్కరికీ తెలిసి
వచ్చిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని
నియోజకవర్గంలో 10 వేల మొక్కలను నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు
తెలిపారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని.. కనుక ప్రతిఒక్కరూ ఉద్యమ
స్ఫూర్తిని చాటి జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
పిలుపునిచ్చారు. మొక్క నాటడంతో సరిపెట్టకుండా ట్రీ గార్డులతో ప్రతి ఒక్క
మొక్కను సంరక్షించి జీవావరణాన్ని కాపాడాలని కోరారు. మన పెద్దలు మనకు అందించిన
స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యధావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతిఒక్కరూ
ప్రతిన బూనాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు తోపుల వరలక్ష్మి,
శోభన్, శర్మ, తదితరులు పాల్గొన్నారు.