ఆగస్టు 1 నుండి తరగతులు ప్రారంభం
సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
విజయవాడ : ఎపిఈసెట్ 2023 అడ్మిషన్ల ప్రక్రియలో సీట్లు పొందిన విద్యార్ధులు
ఆదివారం (జులై 30) సైతం నిర్ధశించిన కళాశాలల్లో రిపోర్టు చేయవచ్చని సాంకేతిక
విద్యాశాఖ కమీషనర్, ఈసెట్ ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రెండో
సంవత్సరం ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఈసెట్ కౌన్సిలింగ్ షేడ్యూలును
అనుసరించి ఆగస్టు 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈ
సంవత్సరం ఈసెట్ కోసం 38,181 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 34,503 మంది
విద్యార్ధులు హాజరయ్యారు. 92.55 శాతంతో 31,933 మంది అర్హత సాధించారన్నారు.
వీరిలో 19,994 మంది రిజిస్టర్ చేసుకోగా, 19720 మందిని అర్హులుగా నిలిచారని,
తద్వారా 19,602 మంది ఆప్షన్స్ పెట్టుకున్నారని వివరించారు. మొత్తం 237
కళాశాలల్లో 37,467 సీట్లు ఉండగా, ప్రవేటు విభాగంలో 218 కళాశాలలకు గాను 35,100,
ప్రభుత్వ పరంగా 19 విశ్వవిద్యాలయ కళాశాలల్లొ 2,367 సీట్లు అందుబాటులో
ఉన్నాయన్నారు. తొలి విడత కౌన్సిలింగ్ లో భాగంగా యూనివర్సిటీ కళాశాలలకు 1,912
మందిని, ప్రవేటు కళాశాలలకు 15,667 మందిని కేటాయించామన్నారు. మిగిలిన సీట్టను
రెండో విడత కౌన్సిలింగ్ లో భర్తీ చేస్తామని నాగరాణి పేర్కొన్నారు. నిబంధనల
ప్రకారం క్రీడలు, వికలాంగులు, సాయిధ దళాల ఉద్యోగుల పిల్లలు, ఎన్ సిసి, భారత్
స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని, అయితే 166 క్రీడల
కోటా, 336 ఎన్ సిసి కోటా సీట్లు భర్తీ చేయలేదని వివరించారు. క్రీడా ప్రాధికార
సంస్ధ, ఎన్ సిసి అధికారుల నుండి మెరిట్ జాబితా రావలసి ఉందని అన్నారు. మరింత
సమాచారం కోసం మంగళగిరి, సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం ఆవరణలోని ఎపి ఈసెట్
కన్వీనర్ కార్యాలయాన్ని సందర్శించవచ్చన్నారు. 7995681678, 7995865456,
9177927677 ఫోన్ నెంబర్ల ద్వారా సహాయ కేంద్రాల అధికారులతో కార్యాలయ పనివేళలలో
సంప్రదించవచ్చని నాగరాణి పేర్కొన్నారు.