ఆగస్ట్ 1న 600 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇనార్బిట్ మాల్ కు ముఖ్య మంత్రి
శంకుస్ధాపన
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజని
విశాఖపట్నం : విశాఖపట్నం పై ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక
దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ ఛార్జ్
మంత్రి విడదల రజని వెల్లడించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ వీడియో
కాన్ఫరెన్స్ హాలులో టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డితో కలసి ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి
ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అందులో భాగంగా శనివారం తూర్పు, విశాఖ దక్షిణ నియోజకవర్గాల వారీగా అభివృద్ధి,
నియోజకవర్గ స్థాయి లో ఉన్న సమస్యలపై సమీక్షించినట్లు వివరించారు. ముఖ్యంగా
రెవెన్యూ, జివిఎంసి, నాడు-నేడు, గడపగడపకు మన ప్రభుత్వం, ఇతర అంశాలపై
సమీక్షించినట్లు ఆమె తెలిపారు. అభివృద్ధి పనులపై సమీక్షించగా ఇందులో కొన్ని
పనులు పూర్తి కాగా మరి కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాను మరింత
అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. అన్ని
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో 11 రకాల అంశాలు గూర్చి ప్రజలకు చేరువ చేయడం
జరుగుతోందన్నారు. ఇంటింటికీ వెళ్ళి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరించడం
జరుగుతుందని వివరించారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి తగు చర్యలు
తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు
బ్రహ్మరథం పడుతూ సంతోషిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గతంలో 11 ప్రభుత్వ
వైద్య కళాశాలలు ఉండగా అవి కొనసాగుతూనే, ఈ యేడాది నుండి 5 వైద్య కళాశాలను
ప్రపంచ స్థాయి సౌకర్యాలుతో ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. చదువుల కోసం
రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే
చదువుకునే విధంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలుతో వైద్య కళాశాలు
ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉంటే ఆ ప్రాంత
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైద్య
కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ జిల్లాను ఒక వైపు
సంక్షేమంతో మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం
జరిగిందన్నారు. కింగ్ జార్జి ఆసుపత్రి 600 కోట్లతో నాడు-నేడు ద్వారా అభివృద్ధి
చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కెజిహెచ్ ను 11కోట్ల వ్యయంతో జిల్లా కలెక్టర్
సియస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. స్థానిక పోర్ట్ హా
స్పిటల్ సమీపంలో సుమారు 600 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రహేజా గ్రూపునకు
చెందిన ఇనార్బిట్ మాల్, 135 కోట్ల రూపాయలతో చేపడుతున్న జీవీఎంసీ అభివృద్ధి
పనులకు ఆగస్ట్ 1న ముఖ్య మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలో
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై సమీక్షలు ఏర్పాటు చేస్తున్నట్లు
వివరించారు. అందులో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్, జివిఎంసి కమిషనర్,
జాయింట్ కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు
చెప్పారు. తూర్పు, దక్షిణ నియోజకవర్గాల శాసన సభ్యులు, ఇన్ చార్జ్ లు,
కార్పొరేటర్లుతో నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ, జివిఎంసి, నాడు-నేడు,
గడపగడపకు మన ప్రభుత్వం, ఇతర అంశాలపై సమీక్షించినట్లు చెప్పారు. వీధి లైట్లు,
శానిటేషన్ తదితర అనేక అంశాలు చర్చలో వచ్చాయన్నారు. ప్రజా ప్రతినిదులు
లేవనెత్తిన సమస్యలు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. సౌత్ కి
సంబంధించిన రోడ్లు, మెడికల్ సౌకర్యం,తూర్పు నియోజకవర్గంలో మత్స్య కారులు
సమస్యలు తదితర సమస్యలు పై చర్చించడం జరిగిందన్నారు. పూర్తి అయిన పనులు,
పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులకు చెప్పినట్లు
తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ సమస్యలుపైన చర్చించినట్లు
పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలపై ప్రత్యేక
దృష్టి సారించి రాబోయే రెండు మూడు నెలల్లో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
ఇవ్వడం జరిగిందన్నారు. విలేఖరుల సమావేశంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట
కుమారి, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, గాజువాక
నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నెడ్ క్యాప్ ఛైర్మన్ కెకె రాజు,
ఎవ్మెుల్సీ వంశీ కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.