నెల్లూరు : రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, వారి పాలనలో నేడు కార్పోరేట్ స్కూల్స్ కు
మిన్నగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్ధులకు అవసరమైన మౌలిక
సదుపాయాలను కల్పిస్తున్నట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ
నాగార్జున పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో
ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నాగార్జున మాట్లాడుతూ పేదబడుగు
బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి అర్హతే ప్రామాణికంగా అనేక సంక్షేమ
కార్యక్రమాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి
దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాల
అమలులో భాగంగా సుమారు 2.45 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్దిదారుల ఖాతాలో
జమచేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని మంత్రి అన్నారు. కరోన సమయంలో
పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. నాడు నేడు కార్యక్రమం
ద్వారా స్కూల్స్, వసతి గృహాల్లో మౌలిక వసతుల్లో భాగంగా అభివృద్ధి పనులు
చేపట్టి నేడు కార్పోరేట్ స్కూల్స్ కు మిన్నగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో
విద్యార్ధులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రాజ్యాంగ బద్దంగా జనాభా ప్రాతిపదికన, ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ
వర్గాలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.