గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు ప్రధాన రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలను పటిష్ఠంగా, పకడ్బందీగా అమలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యా శాఖ ప్రగతిని మంత్రి వివరించారు. ఈసందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్యా సంస్కరణలతో పిల్లలకు, విద్యార్థులకు మంచి జరగాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప మరేతర వ్యక్తిగత ఉద్ధేశ్యాలు లేవని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం రాకముందు విద్యారంగం పరిస్థితి ఏంటి.? ఇప్పటి పరిస్థితి ఏంటి..? అనేది ప్రతిపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు. కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా 44 వేల 570 ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలను కల్పిస్తూ విద్యాభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జాతీయ విద్యా విధానం, శాస్త్రీయ విధానంలోనే సంస్కరణలు కొనసాగిస్తున్నామని, ఫౌండేషన్ స్కూళ్లు, సిబిఎస్ ఇ విధానం, పాఠశాలల విలీనం, ఇవన్నీ కూడా సంస్కరణలలో భాగమేనని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు అంశాలు దివంగనేత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పెటెంట్ అని అన్నారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం తండ్రి వైఎస్సార్ రెండు అడుగు ముందుకేస్తే, ఆయన తనయుడిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తాను నాలుగు అడుగులు ముందుకేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు చెప్పిన మాటలకు అనుగుణంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మనబడి నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధికి కోట్ల నిధులను వెచ్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 44,500లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు క్రింద మూడు ఫేజ్ లలో అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే ఫేజ్-1 పనులు పూర్తికాగా ఫేజ్-2 పనులు జరుగుతున్నాయని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం 2019 వరకూ ప్రభుత్వ పాఠశాలల గత పరిస్థితి, ఈ ప్రభుత్వంలో ప్రస్తుత విద్యా రంగ పరిస్థితులను బేరీజు వేసి చూసుకోవాలని ఆయన కోరారు.
గత ప్రభుత్వంలో 2014లో ప్రభుత్వ బడుల్లో 42 లక్షల మంది విద్యార్థులుంటే… 2019 నాటికి ఆ సంఖ్య 37 లక్షలకు ఎందుకు తగ్గిందని ఆయన ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చినపుడు ఉన్న 37 లక్షలని మళ్లీ 42 లక్షలకి పెంచగలిగామంటే మేము తీసుకున్న విధానాలే కారణమన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 2,900 స్కూళ్లు మూతపడ్డాయని, ఈ ప్రభుత్వ హాయాంలో మూతపడిన స్కూల్ ఒక్కటైనా చూపించగలరా..? అని ప్రశ్నించారు. ఇంగ్లీషు మీడియంపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలన్నారు. పేద బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదనేదే వారి ఆలోచనా విధానమా..? సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని మంత్రి బొత్స తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.
రాజశేఖర్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్ధాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. విద్య ద్వారానే పేదరికం పోతుందని పూర్తిగా విశ్వసించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యరంగానికి అధిక నిధులు ఖర్చుచేస్తున్నారని తెలిపారు. 90 నుండి 95 శాతం నిరుపేదలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారన్నారు. విద్యా ప్రమాణాలపై ఎప్పటికపుడు కేంద్ర, రాష్ట్ర స్ధాయిలో పరిశీలన జరుగుతోందన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం రాకముందే రాష్ట్రప్రభుత్వం నియమించిన బాలకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా విద్యావిధానంలో సంస్కరణలు సూచించిందని తెలిపారు. 10+2 విద్యావిధానంలో మార్పులు తీసుకు వచ్చామన్నారు. 2019 నాటికి 15 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 55 శాతం విద్యార్ధులు చదివితే, 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 45 శాతం విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని తెలిపారు. పేదవాళ్లు సైతం తమ పిల్లలని బాగా చదవాలనే ప్రైవేట్ వైపు అడుగులు వేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇంగ్లీష్ మీడియం కోసం పది కిలోమీర్ల పైన ప్రైవేట్ స్కూళ్లకి కూడా వెళ్తున్నారని తెలిపారు. 96 శాతం మంది తల్లితండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుతున్నారని తెలిపారు. పూర్తిస్ధాయిలో కసరత్తులు చేసిన తర్వాతే పాఠశాలల మ్యాపింగ్ చేపట్టామని స్పష్టం చేశారు. సబ్జెక్ట్ ఉపాధ్యాయులతోనే మూడు, నాలుగు, అయిదు తరగతుల విద్యార్ధులకి పాఠ్యాంశాల బోధన జరుగుతుందన్నారు.
4067 మంది ఉపాధ్యాయులకి పదోన్నతులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాదికి ఈ పాఠశాలలకి 35 వేల అదనపు తరగతులని నిర్మించబోతున్నామని తెలిపారు. విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్ కోసమే ఈ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్. సురేష్ కుమార్, ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ ఎం.వి. శేషగిరి బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.