వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
విజయవాడ : ఈ దశాబ్దం చివరికల్లా (2029–30) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక
వ్యవస్థగా ఇండియా అవతరిస్తుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ
విషయానికి సంబందించి అనేక అంశాలు వివరించారు.దేశంలోని కార్మికులు, కర్షకులు
ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ ఓ సమావేశంలో
అన్న మాటలు నిజమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు సైతం
ధ్రువీకరిస్తున్నాయన్నారు. సాంకేతికపరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి
ప్రయోజనాలను వారి ముంగిట్లోనే అందజేస్తున్నారని అంటూ భారత్ సాధించే విశేష
ప్రగతిపై ధంఖడ్ విశ్వాసం వ్యక్తం చేశారని అన్నారు. ఉపరాష్ట్రపతి
అభిప్రాయాలతో ఏకీభవించే విధంగా ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డూయిష్
బ్యాంక్ కూడా ఇండియాపై తన అంచనాలు ప్రకటించింది. 2030 నాటికి భారత వార్షిక
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల
డాలర్లకు పెరుగుతుందన్నారు. ఇంతటి ఆర్థికాభివృద్ధిని మధ్యకాలంలో నిలకడగా
సాధించాలంటే తరచు చెప్పే అధిక జనాభా లేదా వస్తు వినియోగం మాత్రమే సరిపోదు. ఈ
రెండూ ఇండియాకు ఆర్థికంగా సత్తువ ఇచ్చే కీలకాంశాలని డూయిష్ బ్యాంక్
వ్యాఖ్యానించింది. తన అంచనాకు కారణాలు వివరిస్తూ, దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న
యువత జనాభా ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు దీనికి
తోడవుతున్నాయని సంస్థ వివరించిందన్నారు. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2025
కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం
వ్యక్తం చేస్తుండగా, 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక
వ్యవస్థగా అవరిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని నిరంతరం విశ్లేషించే
అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసిందని విజయసాయి
రెడ్డి అన్నారు.
డిజిటలైజేషన్, ఫైనాన్షియలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థ దూకుడు : నగదు వాడకం
స్థానంలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతో ఉత్పాదకత పెరిగిందని విజయసాయి రెడ్డి
అన్నారు. ఫైనాన్షియలైజేషన్ (మార్కెట్లు వంటి ఫైనాన్షియల్ సంస్థల సైజు,
ప్రభావం పెరగడం) వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది. పరిశుభ్రమైన ఇంథన
వినియోగం వల్ల కూడా వ్యవస్థలో సామర్ధ్యం పెరుగుతుందని డూయిష్ బ్యాంక్
అభిప్రాయపడింది. ఇండియాలో పనిచేసే వయసున్న జనాభా సైజు విస్తరించడం మరో
ప్రోత్సాహకర అంశమని అన్నారు. ప్రస్తుతం ఇలాంటి యువత సంఖ్య 2007లో చైనాలో ఉన్న
స్థాయిలో ఇండియాలో ఉందన్నారు. భారత సమగ్ర జీడీపీ, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి
ఇదే విధంగా చైనాను పోలి ఉన్నాయని చెప్పారు. వచ్చే పదేళ్లలో దేశంలో పనిచేసే
యువతరం సంఖ్యకు అదనంగా 9 కోట్ల 80 లక్షల మంది తోడవుతయని చెప్పారు. ప్రపంచంలో
పనిచేసే జనాభా సంఖ్యలో పెరుగుదల ఒక్క ఇండియాలోనే 22 శాతంగా ఉంటుందని కూడా ఈ
జర్మన్ సంస్థ అంచనావేసింది. సంతృప్తికర కొనుగోలు శక్తి ఉండే భారత మధ్య తరగతి
ప్రపంచంలోనే అతిపెద్దదని తెలిపారు. ప్రస్తుతం 37 కోట్ల 10 లక్షల మంది మధ్య
తరగతి (మిడిల్ క్లాస్) దేశంలో వస్తు వినిమయం పెరగడానికి దోహదం
చేస్తోందన్నారు. వచ్చే దశాబ్దాల్లో కూడా వినియోగం పెరగడానికి భారత మధ్య తరగతి
ప్రజానీకం కారణమౌతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ఫలితంగా గ్రామీణ
ప్రాంతాల మహిళలు కేవలం ఇంటి పనులకు పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో
పాల్గొంటున్నారని చెప్పారు. జేఏఎం (జన్ ధన్ అకౌంట్, ఆధార్ నంబర్, మొబైల్
ఫోన్) అనే మూడు ఆయుధాలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పక్కదారులు పట్టకుండా
కాపాడుతున్నాయని, భారత అభివృద్దికి ఇది మరో కీలక అంశమని అన్నారు. జేఏఎం ద్వారా
నగదు బదిలీ వేగంగా, సునాయాసంగా జరుగుతున్న కారణంగా కోట్లాది మంది సామాన్య
ప్రజానీకానికి మేలు చేకూరుతోందని వెల్లడించారు. మౌలిక సందుపాయాల్లో అత్యంత
ప్రధానమైన రహదారుల అభివృద్ధి, విస్తరణ మున్నెన్నడూ లేని విధంగా
ముందుకుసాగుతున్నాయి. రహదారుల వ్యవస్థకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల
ఇప్పుడు దేశంలో రోజుకు సగటున 36 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు
నిర్మిస్తున్నారని చెప్పారు. గడచిన పది సంవత్సరాల్లో ఇండియాలో మొత్తం 73,000
కిలోమీటర్ల పొడవు గల రహదారులు నిర్మించారు. ఇటీవల కాలంలో దేశంలో విద్చుచ్ఛక్తి
సరఫరా, శుభ్రమైన వంట పద్ధతులు అమలు చేయడంలో సాధించిన ప్రగతి కూడా దేశ ఆర్థిక
వ్యవస్థ పరుగులు పెట్టడానికి పురికొల్పుతోందని ఆయన అన్నారు.