జిల్లాలో 5.26 లక్షల కుటుంబాల్లో మెగా సర్వే పూర్తి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని వినూత్న కార్యక్రమం జగనన్నే మా
భవిష్యత్ అని, ఈ మెగా పీపుల్స్ సర్వే ద్వారా ఇప్పటివరకూ రాష్ట్రంలోని కోటి
కుటుంబాలను నేరుగా కలిశామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
తెలిపారు. ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందనతో ప్రతిపక్షాలు
ఉలిక్కి పడుతున్నాయని అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉమ్మడి
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాల్లో ఈనెల 7 నుంచి ఇప్పటివరకూ
5,26,632 కుటుంబాలను నేరుగా కలిశామని అన్నారు. ప్రజలకు అందుతున్న లబ్ధిని
వివరిస్తూ మెగా సర్వేలో వైఎస్సార్ సీపీకి వారంతా చూపిస్తున్న సానుకూల ధోరణితో
ప్రతిపక్ష పార్టీ నిద్రలేని రాత్రులను గడుపుతోందన్నారు.
ప్రజల ఇళ్లను నేరుగా సందర్శించి వారితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మాత్రమే
ప్రభుత్వం పట్ల వారి దృక్పథం చూడగలమని, ప్రస్తుతం వైఎస్సార్ సీపీ కార్యకర్త
నుంచి నాయకుల వరకు దీన్ని ఆస్వాదిస్తున్నారన్నారు. ప్రతి నెలా 1వ తేదీన
పెన్షన్ పొందుతున్న వృద్ధుల ముఖాల్లో అది కనిపిస్తోందని, అమ్మ ఒడి కృతజ్ఞతతో
పిల్లలను బడికి పంపుతున్న ఆ తల్లుల చిరునవ్వుల్లో, నవరత్నాల అమలుతో లబ్ధి
పొందుతున్న కుటుంబాల ఆశీస్సులతో ప్రజా స్పందన తెలుసుకోగలుగుతున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వారి పిల్లలు తమ భవిష్యత్తు కోసం విశ్వసించే ఏకైక
వ్యక్తి సీఎం జగన్ అని ఈ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా
తేటతెల్లమైందని కృష్ణదాస్ పేర్కొన్నారు.