టీటీడీ తరపున పట్టు వస్త్రాలు
సింహాచలం : విశాఖలోని సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం,
చందనోత్సవం వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. తితిదే తరఫున స్వామి
వారికి పట్టు వస్త్రాలు అందాయి. చందనోత్స ప్రత్యేక అధికారులు, దేవస్థాన
అధికారులు, వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజు, కుటుంబ సభ్యులు నిజరూప
దర్శనానికి వచ్చిన ప్రముఖులకు స్వాగతం పలికారు. అనంతరం.. తెల్లవారుజామున 3
గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు స్వామికి తొలి చందన సమర్పణ
చేసి దర్శనం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్య నారాయణ, మంత్రి గుడివాడ
అమర్నాథ్, తిరుమల తిరుపతి దేవస్థానం తరుఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు పీడికి రాజన్న దొర, పేర్ని
నాని, వెల్లంపలి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు సింహాచల స్వామి వారిని దర్శనం
చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలని, రాష్ట్ర ప్రజలకు సింహాచల లక్ష్మీ
నరసింహ స్వామి అనుగ్రహం ఉండాలని ప్రముఖులు కోరుకున్నారు. ఈ రోజు సుమారు
లక్షన్నర మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుంటారని అధికారులు అంచనా
వేస్తున్నార. తెల్లవారు జామున ఏడు వేల మంది దర్శనం చేసుకున్నారని. అన్ని క్యూ
లైన్లలో భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు విశాఖ పోలీస్ కమిషనర్
త్రివిక్రమ వర్మ తెలిపారు.