విశాఖలో 100 మెగావాట్ల అదానీ డేటా సెంటర్
దీంతోపాటు ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు
రూ.7,210 కోట్ల పెట్టుబడితో 14,825 మందికి ఉపాధి కల్పన
వాక్ టు వర్క్ విధానంలో రెసిడెన్షియల్, సోషల్ ఇన్ఫ్రా అభివృద్ధికి అనుమతి
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
మే 3న సీఎం జగన్ చేతుల మీదుగా భూమి పూజ
అమరావతి : దేశీయ డేటా సెంటర్ సామర్థ్యంలో కనీసం 20 నుంచి 25 శాతం వాటాను
చేజిక్కించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం
దేశవ్యాప్తంగా రూ.45,920 కోట్ల పెట్టుబడితో 138 డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా
సెంటర్లు 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 737 మెగావాట్ల సామర్థ్యాన్ని
కలిగి ఉన్నాయి. 2025 నాటికి ఈ డేటా సెంటర్ల సంఖ్య 183కు చేరడం ద్వారా 24
మిలియన్ చదరపు అడుగులతో 1,752 మెగావాట్ల సామర్థ్యానికి విస్తరిస్తుందని అంచనా
వేస్తున్నారు. ఇందులో కనీసం 20 నుంచి 25 శాతం వాటాను చేజిక్కించుకోవడంలో
లక్ష్యంగా రాష్ట్రంలో డేటా సెంటర్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగా అదానీ గ్రూపు వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ పేరుతో 100
మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
జారీచేసింది. విశాఖపట్నం కాపులుప్పాడ వద్ద సుమారు 130 ఎకరాల్లో రూ.7,210
కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌తోపాటు ఐటీ, బిజినెస్ పార్క్, స్కిల్ సెంటర్,
రిక్రియేషన్ సెంటర్లను అదానీ గ్రూపు అభివృద్ధి చేయనుంది. దీనిద్వారా 14,825
మందికిఉపాధి లభించనుంది.
ఐదు దశల్లో డేటా సెంటర్ అభివృద్ధి : భీమునిపట్నం మండలం కాపులుప్పాడ వద్ద
60.29 ఎకరాల్లో ఈ డేటా సెంటర్‌ను ఐదు దశల్లో అభివృద్ధి చేయనుంది. భూమి
కేటాయించిన మూడు ఏళ్లలోగా 10 మెగావాట్లుతో ప్రారంభించి నాలుగేళ్లకు 20
మెగావాట్లు, ఐదేళ్లకు 40 మెగావాట్లు, ఆరేళ్లకు 70 మెగావాట్లు, ఏడేళ్లకు 100
మెగావాట్ల సామర్థ్యం చేరుకునే విధంగా వైజాగ్ టెక్‌పార్క్ ప్రణాళికకు
ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఫిబ్రవరి 7, 2022లో భూ కేటాయింపులు
చేసింది. అక్కడే నివాసం ఉంటూ పనిచేసుకునే విధంగా వాక్ టు వర్క్ విధానంలో
నివాస ప్రాంతాలు, నివాసానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అవకాశం
కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన
రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రత్యక్షంగా కల్పించే ఉద్యోగాల కల్పన ఆధారంగా
ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ వైజాగ్ టెక్‌పార్క్ నిర్మాణ పనులను మే
3న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర
ఐటీ, పరిశ్రామల శాఖ ప్రణాళిక సిద్ధంచేసుకుంది.