రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
రూ. 1.39 కోట్లతో నిర్మించిన రహదారుల ప్రారంభోత్సవం
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రహదారుల
నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్లానింగ్
బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.
న్యూరాజరాజేశ్వరి పేటలో రూ.19.99 లక్షలతో అభివృద్ధి పరచిన రోడ్లతో పాటు 58 వ
డివిజన్ సన్ సిటీ కాలనీ, షణ్ముఖ సాయినగర్, ఉప్పలపాటి సీతారామరాజు వీధిలో రూ.
కోటి 19 లక్షలతో అభివృద్ధి పరచిన రహదారులను డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ
రెడ్డి, వైసీపీ కార్పొరేటర్ ఇసరపు దేవిలతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.
గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా మారాయి అనే విషయంపై అవగాహన కల్పిస్తూ
ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కాలనీవాసులు ఆసక్తిగా తిలకించారు. వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డివిజన్
సకల సదుపాయాలతో కళకళలాడుతున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రధానంగా
రోడ్ల నిర్మాణంలో కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ప్రజల ప్రోత్సాహం, సహకారంతోనే ఇదంతా సాధ్యపడిందని తెలియజేశారు. అలాగే గడప
గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు
అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా
న్యూరాజరాజేశ్వరి పేటలో రూ.20 లక్షల నిధులతో మసీదు రోడ్డు, పోలీస్ స్టేషన్
రోడ్డు, ఏటీఎం రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించుకోవడం జరిగిందన్నారు.
పూర్తి చేసుకున్న పనుల ప్రగతినంతా నాడు – నేడు ద్వారా ఎప్పటికప్పుడు ఫోటో
ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వేసిన రోడ్లపై
పర్యటనలు చేస్తూ టీడీపీ నేతలు మాపై బురదచల్లడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న
రోజుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికై మరింత ఉత్సాహంగా
కృషి చేస్తామని స్పష్టం చేశారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి
మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివారు
కాలనీలలో పెనుమార్పు వచ్చిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి,
వేస్తున్న రోడ్లు చంద్రబాబు, ఎల్లో మీడియాకి కనిపించడం లేదా..? అని
ప్రశ్నించారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ
దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం,
నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, ఇసరపు రాజా రమేష్, కాళ్ల ఆదినారాయణ,
గుండె సుందర్ పాల్, ప్రేమ్ కుమార్, ఎన్.ఎస్.ఆర్, మన్యం, పఠాన్ నజీన్ ఖాన్,
బాల, తోపుల వరలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.