ప్రతి పేద కుటుంబానికి పెద్ద దిక్కుగా సీఎం జగన్
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
277 వార్డు సచివాలయాల పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, సూర్య బ్యూరో ప్రతినిధి : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద దిక్కుగా నిలిచారని ప్లానింగ్
బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.
మంగళవారం 63 వ డివిజన్ 277 వ వార్డు సచివాలయం పరిధి సుందరయ్యనగర్లో డిప్యూటీ
మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు సచివాలయ పరిధిలోని
1,877 గృహాలలో 142 గడపలను సందర్శించారు. అన్ని వర్గాల ప్రజలను పేరుపేరున
పలకరిస్తూ వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాల అమలు,
అధికారులు, సచివాలయ సిబ్బంది సకాలంలో సహకరిస్తున్నాదీ లేనిదీ అడిగి
తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సైడ్
కాల్వలలో సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన
చోట వీధి దీపాలతో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు
సూచనలు చేశారు.
అగ్రవర్ణ పేదలకు ఆర్థిక చేయూత
పర్యటనలో భాగంగా ఈబీసీ నేస్తం లబ్ధిదారులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు
ముచ్చటించారు. ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలనే ప్రధాన లబ్దిదారులుగా జగనన్న
ప్రభుత్వం ఎంపిక చేస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. మేనిఫెస్టోలో
చెప్పకపోయినా రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర
అగ్రవర్ణ సామాజికవర్గాల్లోని పేద మహిళలకు కూడా మేలుచేయాలన్న సత్సంకల్పంతో
ఈబీసీ నేస్తం పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. రెండో
విడత ద్వారా సెంట్రల్లో 2,439 మందికి రూ. 3.65 కోట్ల లబ్ధి చేకూర్చగా.. వీరిలో
299 మంది కమ్మ, 325 మంది రెడ్డి, 704 మంది ఆర్యవైశ్య, 831 మంది బ్రాహ్మణ, 198
మంది క్షత్రియ, 15 మంది వెలమలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తొలి విడతలో
1,947 మంది ఖాతాలలో రూ. 2 కోట్ల 92 లక్షల 5 వేలు జమ చేయగా.. మొత్తంగా రూ. 6.57
కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. అటువంటి ప్రభుత్వానికి అండగా
నిలవాలని అక్కచెల్లెమ్మలను కోరారు.
బాబు కన్నా పెద్ద రైతు ద్రోహి ఎవరున్నారు..?
విజయవాడ : రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత
చంద్రబాబు, నారా లోకేష్ లకు లేదని మల్లాది విష్ణు విమర్శించారు. బషీర్బాగ్
లో రైతులను కాల్చి చంపింది ఎవరో..? లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. ఏలూరు
కలెక్టరేట్లో రైతులపై చంద్రబాబు లాఠీచార్జ్ చేయించారని, హైదరాబాద్లో
రైతులను గుర్రాలతో తొక్కించారని మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు కట్టలేదని
మెదక్, మహబూబ్నగర్ జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసి వ్యానులో తరలించిన చరిత్ర
చంద్రబాబుదని ధ్వజమెత్తారు. అన్నం పెట్టే రైతన్నలను రోజుల తరబడి జైళ్లలో
పెట్టించారని గుర్తుచేశారు. రుణమాఫీ సహా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను
చంద్రబాబు నిలువునా వంచించారని మల్లాది విష్ణు ఆరోపించారు. రూ.87,612 కోట్ల
వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని నమ్మించి.. చివరకు రూ. 15 వేల
కోట్లతో సరిపెట్టారన్నారు. కానీ ఈ ప్రభుత్వం రైతుల ముంగిటకే వ్యవసాయ పథకాలను
తీసుకువచ్చిందని వెల్లడించారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే.. సీఎం జగన్
దానిని పండుగ చేసి చూపారన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా
పథకం, రాయితీ విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకీకరణ పరికరాలు వంటి సంక్షేమ
పథకాలతో మూడున్నరేళ్లలో అక్షరాల రూ. లక్షా 46 వేల కోట్ల లబ్ధిని అన్నదాతలకు
చేకూర్చినట్లు వివరించారు. కనుక రైతులకు మాయమాటలు చెప్పడం మానుకోవాలని
నారాలోకేష్ కు సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విషం చిమ్ముతున్న
తెలంగాణ మంత్రులను భుజానకెత్తుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆంధ్రా
వాసినా..? తెలంగాణ వాసినా..? సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్
చేశారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, ఏఎంఓహెచ్
రామకోటేశ్వరరావు, ఆర్ఐలు ప్రసాద్, సరత్, సీడీఓ జగదీశ్వరి, నాయకులు మోదుగుల
గణేష్, సీహెచ్ రవి, టెక్యం కృష్ణ, నాగు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ
సిబ్బంది పాల్గొన్నారు.