మరికొంత సమయం కావాలన్న ఎన్ఐఏ
అమరావతి : ఎన్ఐఏ అభ్యర్థన మేరకు కోడికత్తి కేసు విచారణను విజయవాడ కోర్టు
వాయిదా వేసింది. ఈ నెల 20న విచారణ చేపడతామని వెల్లడించింది. తెలుగు
రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ
స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి జగన్ తరఫు న్యాయవాది ఎన్ఐఏ
కోర్టులో తన వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలు
వినిపించేందుకు ఎన్ఐఏకి అవకాశం ఇచ్చింది. అయితే, తమ వాదనలు వినిపించేందుకు
కొంత సమయం కావాలని ఎన్ఐఏ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీంతో
తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కోడికత్తి కేసు విషయంలో లోతుగా దర్యాప్తు జరపాలంటూ గతంలో సీఎం జగన్ దాఖలు
చేసిన పిటిషన్‌పై ఇటీవల విజయవాడ కోర్టులో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. ఈ
కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని పేర్కొంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ
ఘటనతో అక్కడి రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు సంబంధం లేదని కౌంటర్లో ఎన్ఐఏ
తెలిపింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు
కాదని స్పష్టం చేసింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం
లేదని, జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టుకు ఎన్ఐఏ విజ్ఞప్తి
చేసింది. ఈ నేపథ్యంలో వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కోరిన సీఎం జగన్
తరఫు న్యాయవాది తాజాగా తమ వాదనలను కోర్టుకు వినిపించారు. అయితే, ఎన్ఐఏ
అభ్యర్థన మేరకు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.