ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ : విద్యార్థి దశ నుండే సేంద్రియ వ్యవసాయం, కిచెన్ గార్డెన్
నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన ఆహార
ఉత్పత్తులను వినియోగించుకునేందుకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్
ఎస్.డిల్లీరావు అన్నారు. సేంద్రియ వ్యవసాయం, కిచెన్ గార్డెన్ ప్రధాన అంశంగా
ఇంటర్నషిప్ తీసుకున్న మేరిస్ స్టెల్లా కళాశాల విద్యార్థులు సోమవారం
కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డిల్లీరావును కలిసి కలెక్టరేట్ ఆవరణ, బాలిక
వసతి గృహం, అంగన్వాడీ కేంద్రంలో చేపట్టే సేంద్రియ వ్యవసాయం, కిచెన్ గార్డెన్
గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ, ప్రస్తుత
పరిస్థితులలో అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో రైతులు కూరగాయలు, ఆకుకూరలు,
పండ్ల తోటల పెంపకంలో అవసరాలకు మించి ఎరువులు పురుగుమందులతో పాటు మార్కెట్లో
నిల్వ ఉండేందుకు రసాయనాలను వినియోగించడం వల్ల ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం
చూపుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులలో సేంద్రియ ఉత్పత్తులను వినియోగించేలా
ప్రజలను చైతన్యవంతులుగా చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వారి కనీస
కుటుంబ అవసరాలకు సరిపడ కూరగాయలు, ఆకుకూరలను స్వయంగా పండించి వినియోగించుకునేలా
ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనేక మంది నివాస గృహాల టెర్రస్‌లపైన ఖాళీ
ప్రదేశాలలో సేంద్రీయ పద్దతిలో కూరగాయలు, ఆకుకూరలు పండ్లు పండిస్తూ
ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. వర్మికంపోస్టు, పోస్టు
హర్వేస్ట్ టెక్నాలజిని, ట్రైకోడెర్మో, వంటి హాని తలపెట్టని ఫంగస్‌లను సేంద్రీయ
పద్ధతులపై ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు విద్యార్థులు ముందుకు రావడం
అభినందనీయమన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి
సేంద్రియ పద్దతులో పండించిన ఆకుకూరలను అంగన్వాడీ కేంద్రాలలో వినియోగించాలని
శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
స్టెల్లా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ తమ కళాశాల ద్వారా ఇంటర్నషిప్ గా
సేంద్రియ వ్యవసాయం, కిచెన్ గార్డెన్ నిర్వహణను ప్రధాన అంశంగా
ఎంచుకున్నామన్నారు. మార్పు ట్రస్ట్, ఏపి సిఎన్ఎఫ్ అధికారులు సహకారంతో
కలెక్టరేట్ ఆవరణ, వసతి గృహం, అంగన్వాడీ కేంద్రంలో రెండు నెలల పాటు సేంద్రియ
విధానంలో ఆకుకూరల పెంపకం కిచెన్ గార్డెన్ల నిర్వహించనునట్లు తెలిపారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్‌కుమార్, డిఆర్వో కె.మోహన్‌కుమార్,
ఏపి సిఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విజయకుమారి, ఐసిడిఎస్ నోడల్ ఆఫీసర్
సాయిగీత, మేరిస్ స్టెల్లా కళాశాల విద్యార్థులు కె.సాహిత్య, జి.సిందు,
పి.ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.