సంక్షేమంలో తండ్రిని మించిన తనయుడు జగన్
రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
పల్లెగండ్రేడు సచివాలయ భవనం ప్రారంభం
విజయనగరం : ఊరి బాగు కోసం, ప్రజలందరికీ మేలు చేయడం కోసం ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహనరెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని,
రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సంక్షేమంలో
ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి తండ్రిని మించిన తనయుడని కొనియాడారు.
గుర్ల మండలం పల్లె గండ్రేడు గ్రామం వద్ద సుమారు రూ.40లక్షలతో నిర్మించిన
సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో
మంత్రి బొత్స మాట్లాడుతూ, గతంలో గ్రామాల్లో ప్రజలకు సేవలు అందించేందుకు
ఒకరో ఇద్దరో ప్రభుత్వ సిబ్బంది ఉండేవారని, కాని ఇప్పుడు సచివాలయ
వ్యవస్థ ద్వారా అత్యున్నత విద్యార్హతలతో కూడిన పదిమంది సచివాలయ
కార్యదర్శులు అందుబాటులోకి వచ్చారని అన్నారు. అభివృద్ది, ఆరోగ్యం,
సంక్షేమాన్ని ప్రజలకు అందించడం, ప్రభుత్వ సేవలను ప్రజలముంగిటకే
చేర్చడం వీరి విధులని పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతీఒక్క హామీని అమలు
చేయడం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి
కొత్త చరిత్ర సృష్టించారని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని మించిన
తనయుడని అనిపించుకున్నారని పేర్కొన్నారు. తండ్రి కంటే కొడుకు పాలన
ప్రజలకు రెట్టింపు ధైర్యాన్ని ఇచ్చిందని కొనియాడారు. అవినీతి,
లంచగొండితనం లేని ఆదర్శ పాలనను అందిస్తూ, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ
పథకాలను ప్రజలకు చేరుస్తున్నారని అన్నారు. పేదల ఆకలితో రాజకీయాలు
చేయబోమని, అర్హతే ప్రామాణికంగా పార్టీలకు అతీతంగా పథకాలను
అందిస్తున్నామని అన్నారు. గ్రామంలో సంక్షేమ పథకాల అమలు తీరును
తెలుసుకున్నారు. గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తామని, రాజులపేట
వరకు రోడ్డు, ఎస్సి కాలనీలో సిసి రోడ్లను నిర్మిస్తామని మంత్రి హామీ
ఇచ్చారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అర్హత
ఉన్న ప్రతీఒక్కరికీ నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు.
ఒక్క పల్లె గండ్రేడు గ్రామంలోనే గత నాలుగేళ్లలో వివిధ సంక్షేమ పథకాల
ద్వారా ప్రజలకు సుమారు రూ.8.5 కోట్లను అందజేశామని చెప్పారు. గ్రామానికి
సాగునీరు అందించామని, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ త్రాగునీటిని
సరఫరా చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతీఒక్కరికీ సంక్షేమ
పథకాలను అందిస్తున్నామన్నారు. గతానికీ, ఇప్పటి ప్రభుత్వానికి తేడా
చూడాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి రాష్ట్రానికి
ఆశాదీపమని, ఆయనకు ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపి
బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, అన్ని సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్ద
పీట వేయడం జరుగుతోందన్నారు. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని
చెప్పారు. చేయూత, ఆశరా, అమ్మ ఒడి, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి
దీవెన తదితర పథకాలను వివరించారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య
కళాశాలను నిర్మిస్తున్నారని, దీనివల్ల ఆధునిక వైద్య సేవలు జిల్లాలోనే
అందుబాటులోకి వస్తాయని చెప్పారు. త్వరలో భోగాపురం విమానాశ్రయానికి
ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని అన్నారు. ఒకవైపు సంక్షేమంతోపాటు,
మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.
గ్రామంలో నాలుగు విద్యుత్ స్థంభాలు, త్రాగునీటి బోరు నిర్మాణానికి ఎంపి
నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి శీర
అప్పలనాయుడు, ఎంపిపి పొట్నూరు ప్రమీల, జెడ్పి సిఇఓ ఎం.అశోక్‌కుమార్,
డిఎల్డిఓ లక్ష్మణరావు, ఆర్డిఓ ఎంవి సూర్యకళ, కెవి సూర్యనారాయణరాజు,
పొట్నూరు సన్యాసినాయుడు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు
పాల్గొన్నారు.