నిమ్మకూరులో చంద్రబాబుకు ఘనస్వాగతం
నిమ్మకూరు గ్రామస్థులతో చంద్రబాబు ఆత్మీయ సమ్మేళనం
కృష్ణా జిల్లా : టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన రెండో
రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా గురువారం నిమ్మకూరు గ్రామస్థులతో చంద్రబాబు
ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నిమ్మకూరు ఇంటి అల్లుడి హోదాలో చంద్రబాబుకు
నిమ్మకూరు గ్రామ ఆడపడుచులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నందమూరి కుటుంబం తరపున
చంద్రబాబుకు హరికృష్ణ కుమార్తె సుహాసిని, నందమూరి రామకృష్ణ కొత్త వస్త్రాలను
అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు , వర్ల
రామయ్య , కొనకళ్ల నారాయణ , కుమార్ రాజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ నడయాడిన నేలపై తాము తిరగడం
ఆనందంగా ఉందన్నారు. సామాన్యమైన కుటుంబంలో పుట్టి యుగ పురుషుడిగా చరిత్ర
సృష్టించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాలలో
ఎన్టీఆర్కు ఎవరూ సాటిరారని తెలిపారు. ప్రపంచంలోనే తెలుగు వాడికి గౌరవం
దక్కిందంటే నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు మాత్రమే కారణమని స్పష్టం చశారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను టీడీపీ ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఎన్టీఆర్ శత
జయంతి ఉత్సవాలలో వంద సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రిలో వందో సభ
ఎన్టీఆర్ జయంతి రోజున చాలా ఘనంగా నిర్వహిస్తామన్నారు. అందరం కలిసి ముందుకు
అడుగులు వేయాలని అచ్చెన్నాయుడు కోరారు.
కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరుకు ఒక చరిత్ర
ఉందన్నారు. పేదలకోసం సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ ప్రవేశపెట్టారన్నారు. మహిళలకు
ఆస్తిలో సమాన హక్కు, బడుగు బలహీన వర్గాలకు చట్ట సభలకు పంపిన మహానుభావుడు
ఎన్టీఆర్ అని కొనియాడారు. నిమ్మకూరు అల్లుడు చంద్రబాబు ఇక్కడకు రావడం మనకి
పండుగన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుకు అందరూ అండగా నిలబడాలని అన్నారు.
సమిష్టిగా పని చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కొనకళ్ల పిలుపునిచ్చారు.