వెలగపూడి : రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిసి కెమెరాలను పూర్తి
స్థాయిలో వినియోగించేందుకు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని దీనిపై ఒక సమగ్ర
కార్యాచరణ నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్
రెడ్డి పోలీస్,రవాణా,ఆర్అండ్బి శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి
రాష్ట్ర సచివాలయంలో రహదారి భద్రతకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
సిఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా గత ఎగ్జిక్యూటివ్ కమిటీ
సమావేశంలో మంజూరు చేసిన పనుల ప్రగతిని సమీక్షించారు. అనంతరం ప్రస్తుత
సమావేశంలో ప్రతిపాదించిన వివిధ పనులకు సంబంధించిన అజెండా అంశాలను టిఆర్అండ్బి
శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిఎస్ కు
వివరించారు.
ఈసందర్భంగా సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా
రహదారి భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ ఆంక్షల ఉల్లంఘన నియంత్రణ తదితర
లక్ష్యాలతో గతంలో కొనుగోలు చేసి అందుబాటులో ఉన్న సుమారు 60 వేల కెమెరాలను
పూర్తి స్థాయిలో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నివేదికను సమర్పించాలని సిఎస్
జవహర్ రెడ్డి ఆదేశించారు.
ఈఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో 90 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతి పాదించిన
వివిధ మైనర్ పనుల నిర్వహణకు ఆమోదం తెలిపారు.అదే విధంగా 21కోట్ల 22 లక్షల
రూపాయల అంచనాలతో కొనుగోలుకు ప్రతిపాదించిన స్పీడ్ గన్లు,బ్రీత్ ఎనలైజర్లు,
బాడీ వార్న్ కెమెరాలు, డాష్ బోర్డ్ కెమెరాలు, ఆటోమోటెడ్ డ్రైవింగ్ అండ్
టెస్టింగ్ ఇనిస్టిట్యూట్లకు వివిధ పరికరాల కొనుగోలుపై చర్చించి ఆమోదించారు.
అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జాతీయ రహదార్లు, రాష్ట్ర రహదార్లు ఇతర
ముఖ్య రహదార్లపై గుర్తించిన బ్లాక్ స్పాట్ల నివారణకు వివిధ జిల్లాల నుండి
అందిన 48కోట్ల 50 లక్షల రూ.ల విలువైన ప్రతిపాదనలను జాతీయ రహదార్ల అభివృద్ధి
సంస్థకు పంపినట్లు అజెండా అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన
టిఆర్అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్న సిఎస్ కు వివరించగా ఆ ప్రతిపాదనలకు
ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది.రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో వివిధ రోడ్ల
మార్కింగ్లు, ట్రాఫిక్ క్లెయిమింగ్ మెజర్సు,క్రాష్ బ్యారియర్సు ఏర్పాటుకు
71కోట్ల 21 లక్షల రూ.ల అంచనాతో రూపొందించిన ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం
తెలిపింది. ఇంకా ఈ సమావేశంలో రహదారి భద్రతకు సంబంధించి వివిధ అంశాలపై
సమీక్షించారు. ఈసమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఎస్.ఎస్.రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరిష్ కుమార్ గుప్త, రవాణా శాఖ అదనపు
కమీషనర్ ప్రసాదరావు, టిఆర్అండ్బి సిఇ శ్రీనివాసులు రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.