విజయవాడ : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల హృదయాల
నుంచి పుట్టినదే ‘జగనన్నే మా భవిష్యత్తు – మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం
అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
తెలిపారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డి రెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం ఆయన విలేకర్ల
సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడి అవసరాలు గుర్తించి, నూటికి
నూరుశాతం వాటిని తీర్చడమే కాకుండా వారి బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడు సీఎం
వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. ఇప్పటికే గడప
గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతోందని
తెలిపారు. ప్రజలతో మరింతగా మమేకమవుతూ.. వారి అభిప్రాయం తెలుసుకునే భారీ
కార్యక్రమమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 60 లక్షల కుటుంబాలను 7 లక్షల మంది
జగనన్న సైనికులు ఏకకాలంలో కలవనున్నట్లు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో
96 సచివాలయాల పరిధిలోని 1,405 క్లస్టర్లలో ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా
ప్రారంభమైన ఈ కార్యక్రమం.. 14 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. తాము
పెట్టుకున్న నమ్మకం కంటే రెండింతలు అధికంగా న్యాయం చేస్తూ పరిపాలిస్తుండటంతో
‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ప్రజలు నినదిస్తున్నారని మల్లాది విష్ణు
అన్నారు. ఈ నినాదాన్నే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ చేర్చినట్లు చెప్పారు. సర్వే వివరాలను ఏప్రిల్ 26 న
వెల్లడించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ముఖం చాటేసిన చంద్రబాబు
ప్రజలకు చేసింది ఏమీలేక ముఖం చాటేసిన నేతలు గత ప్రభుత్వంలో ఉంటే.. ఈ
ఫ్రభుత్వంలో గుమ్మం గుమ్మం తిరుగుతూ అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ధైర్యంగా
తీసుకోగలుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రతిఒక్క లబ్ధిదారునికి చేసిన
మేలును గణాంకాలతో సహా వివరిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్
జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంక్షేమ కార్యక్రమాల ద్వారా
అక్షరాలా రూ. 2,96,149 కోట్ల మేర పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు లబ్ధి
చేకూర్చినట్లు వెల్లడించారు. ఒక్క సెంట్రల్లోనే 1,28,158 మంది లబ్ధిదారులకు గత
నాలుగేళ్లలో రూ. 314 కోట్ల సంక్షేమాన్ని నేరుగా డీబీటీ ద్వారా వారి వారి
వ్యక్తిగత ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. విద్య, వైద్య, వ్యవసాయ, గృహ,
పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని
ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు. పరిపాలన సంస్కరణలలో భాగంగా ప్రవేశపెట్టిన
వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికీ ఆత్మబంధువులా మారిందని మల్లాది విష్ణు
అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన
అందించారని తెలిపారు.