అమరావతి : సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఛాన్స్
ఏపీ ఫైబర్ నెట్ కల్పిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ప్రజల వద్దకు సినిమా తీసుకు వస్తున్నామని ఏపీ
ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న వారు
కూడా రిలీజ్ రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. శుక్రవారం
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ రెడ్డి
మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నెట్ సేవలను ఏపీలో తక్కువ ధరకు
అందిస్తున్నాం. పెద్ద హీరోలకు, నిర్మాతలకు మేము వ్యతిరేకం కాదు. సినిమాను బేస్
చేసుకుని ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో ఉంటుంది. ఎల్పీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాము
కాబట్టి పైరసీ ఉండదు. ఏపీఎస్ఎఫ్ఎల్ పల్లెటూర్లతో ఎక్కువ కనెక్ట్ అయింది.
దీనివల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజు సినిమా చూసే అవకాశం
లభిస్తుందన్నారు.
ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ ఏ రోజు సినిమా రిలీజ్
అవుతుందో అదే రోజు పల్లెటూరులో కూడా సినిమా చూడవచ్చనే కాన్సెప్ట్ నాకు బాగా
నచ్చింది. చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఫైబర్ నెట్లో రిలీజ్ అయితే
ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ ‘ఒక నిర్మాత కష్టపడి
సినిమా తీస్తే అది రిలీజ్ రోజునే పైరసీ అయిపోతుంది. ఇండస్ట్రీలో ఉన్న మనం
పైరసీని ఎందుకు అరికట్టలేకపోతున్నాము. పెద్దలందరూ కూడా దీనిపై పోరాడాలి. ఫైబర్
నెట్లో రిలీజ్ రోజున సినిమా చూడడం అనేది చిన్న సినిమాకు ఆక్సిజన్ లాంటిది.
చిన్న నిర్మాతలు ఫైబర్ నెట్లో రిలీజ్ చేస్తారు. పెద్ద నిర్మాతలు కూడా ముందుకు
వస్తారని అనుకుంటున్నానన్నారు.
నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఏపీ ప్రభుత్వం, పోసాని అలీ వల్ల సినిమా
ఇండస్ట్రీకి మంచి జరుగుతోంది. ఫైబర్ నెట్లో సినిమా రిలీజ్ అనేది చిన్న
నిర్మాతకు జగన్ గారిచ్చిన వరం. చిన్న సినిమాకు అసలు థియేటర్స్ ఇవ్వడం లేదు.
జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఈ రోజు చిన్న నిర్మాతలకు పేదల పాలిట పెన్నిదే ఈ
ప్లాట్ఫామ్. ఏపీ సీఎం జగన్ విజన్ చాలా పెద్దది. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి
కోసం మంచి ఆలోచన చేశారు. చిన్న నిర్మాతలకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు సినీ
ఇండస్ట్రీ తరపున ఏ సహాయం కావాలన్నా ముందుంటామని పేర్కొన్నారు.