ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి సీఎం చిత్రపటానికి
క్షీరాభిషేకం
విజయవాడ : ప్రతి కుటుంబానికి మహిళలే రథసారథులుగా వ్యవహరిస్తూ ఆర్థికంగా
బలోపేతం అవ్వాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆసరా
పథకాన్ని అమలు చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని లూనాసెంటర్లో
గురువారం జరిగిన వైఎస్సార్ ఆసరా మూడో విడత ముగింపు సంబరాలలో ఎమ్మెల్సీ ఎండీ
రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన
పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు
వేసి ఘన నివాళులర్పించారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిత్రపటానికి
పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు హయాంలో మహిళలందరూ వివక్షకు గురయ్యారని ఈ
సందర్భంగా మల్లాది విష్ణు ఆరోపించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా
మహిళలను కేవలం రాజకీయ ఉపన్యాసాలకు వినియోగించేదని.. కానీ ఈ ప్రభుత్వం పొదుపు
సంఘాల అక్కచెల్లెమ్మలందరూ ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు
వెల్లడించారు. రాష్ట్రంలోని ఆడపడుచులందరూ వారి కాళ్లపై నిలబడి
వ్యాపారవేత్తలుగా రాణించేలా చేయూతనందిస్తున్నట్లు వివరించారు. అసెంబ్లీ
ఎన్నికల నాటికి (2019 ఏప్రిల్ 11) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు
మొత్తం తమ ప్రభుత్వమే భరిస్తుందన్న మాటను సీఎం జగనన్న నిలబెట్టుకున్నారని
మల్లాది విష్ణు చెప్పారు. నాలుగు విడతల్లో అప్పు మొత్తం చెల్లించేందుకు చర్యలు
తీసుకోగా.. ఇప్పటివరకు మూడు విడతలలో రూ.19,178.17 కోట్లు విడుదల చేసినట్లు
మల్లాది విష్ణు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి రూ. 92
కోట్లు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. కనుకనే నవరత్నాల పథకాలలో వైఎస్సార్
ఆసరా పథకం అగ్రభాగాన నిలిచిందని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. 59 డివిజన్ కు
సంబంధించి మూడవ విడత ఆసరా ద్వారా 240 గ్రూపులలోని 2,400 మంది అక్కచెల్లెమ్మల
ఖాతాలలో రూ. 2 కోట్ల 80 లక్షల 97 వేల 330 రూపాయల నిధులు జమ చేయడమే ఇందుకు
నిదర్శనమన్నారు. నిధులను సద్వినియోగపరచుకునేలా వ్యాపార అవకాశాలు, ఉపాధి
మార్గాలపై మహిళలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం
అక్కచెల్లెమ్మలకు మెగా చెక్కును అందజేశారు.