అమరావతి : ఏపీలో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
చిత్తుశుద్దితో పాలన అందిస్తున్నారని, 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా
ప్రజలకు అందించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా
సమావేశంలో మాట్లాడుతూ, 175 సీట్లులో పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ
సవాల్ విసిరారు. ‘‘సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం తనకు లేదని చంద్రబాబు
ఒప్పుకున్నారు. చంద్రబాబు నిర్దేశం మేరకే పవన్ ఢిల్లీ టూరు. చంద్రబాబును సీఎం
చేసేందుకు పవన్ పార్టీ పెట్టారా? జనసేన పార్టీ గ్రాఫ్ రోజురోజుకు
పడిపోతుంది. పోలవరంపై నాదెండ్ల అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అవాకులు, చవాకులు
పేలుతున్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు అస్తవ్యస్తం చేశారు. పోలవరం
ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని సీఎం జగన్ ఇప్పటికే
అసెంబ్లీలో స్పష్టం చేశారు. దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్‌వాల్‌ను రిపేర్
చేస్తున్నాం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్లే పనులు ఆలస్యం. వీలైనంత త్వరగా
పోలవరాన్ని పూర్తి చేస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు చేసిన
మోసాలు, కుట్రలను వెలుగులోకి తెస్తున్నాం. ఏం చేసినా అధికారంలోకి రాలేరని
చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే రంకెలేస్తూ మాట్లాడుతున్నారు. 175 సీట్లలో
పోటీ చేసే ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు వెళ్లమంటేనే వారాహి
బ్యాచ్ ఢిల్లీ వెళ్లింది. బీజేపీతో విడాకులు తీసుకోమని చంద్రబాబు చెప్పి
పంపారు. కానీ వారాహి బ్యాచ్ కి పనికాలేదు. కాపుల ఓట్లు చీల్చితే కొంత మెరుగు
పడవచ్చని చంద్రబాబు ఆశ. పోలవరం ఎత్తు తగ్గించినట్టు నాదెండ్ల మనోహర్
మాట్లాడారు. ఆయన అజ్ఞానానికి ఇంతకంటే నిదర్శనం ఏముందీ?. అసలు పోలవరం గురించి
నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసు?. ప్రజలను తప్పుదోవ పట్టించేలా
మాట్లాడుతున్నారు’’ అంటూ మంత్రి రాంబాబు దుయ్యబట్టారు.