పార్వతీపురం : సామాన్యుడికి చెంతకు వైద్య సేవలు అందించి ఆరోగ్యకరమైన
సమాజాన్ని నిర్మించుటకొరకు గ్రామస్థాయిలో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి
ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టరు కార్యక్రమం ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి,
గిరిజన సంక్షేమశాఖమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. పేదవాడి ప్రాణం కాపాడటమే
ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకోవడం జరిగిందని ఆయన అన్నారు. పేదలు సద్వినియోగం
చేసుకోవాలని ఆయన కోరారు. ఆరోగ్య శ్రీ లో 3,250 వ్యాధులను చేర్చడం జరిగిందని
ఆయన చెప్పారు. గిరిజనులు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం పొందలేని పరిస్థితుల్లో
ఫ్యామిలీ డాక్టరు విధానం అత్యంత ఉపయోగకరం అన్నారు. రాష్ట్రంలో 17 వైద్య
కళాశాలలు మంజూరు చేయడం జరిగిందని, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం,
సీతంపేట లలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణం జరుగుతుందని ఆయన
వివరించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గురువారం ఫ్యామిలీ డాక్టరు
కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాలో పాచిపెంట మండలం మోసూరు
గ్రామంలో ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమశాఖమంత్రి పీడిక రాజన్నదొర
జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్, 21నఈ
కార్యక్రమాన్ని పైలెట్ ప్రోజెక్టుగా ప్రారంభించిన కార్యక్రమాన్ని ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. రక్తపోటు, మధుమెహం రోగులకు
చికిత్స, మందులు అందించబడతాయని, శస్త్రచికిత్స చేయించుకున్న పేషంట్స్ ను
ఇంటివద్దనే కలిసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు షెడ్యూల్ ప్రకారం అదే గ్రామానికి
సందర్శించేలా 6-7 గ్రామ సచివాలయాలతో మ్యాప్ చేయబడిందని, ప్రతి వైద్యాధికారికి
మొబైల్ ఫోన్ అందించబడుతుందని, ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వైద్యుడిని
పిలవడానికి వీలుగా ప్రజలకు అందించబడుతుందని, ఇది డాక్టర్ మరియు ప్రజల మద్య
మంచి సంబంధాలు ఏర్పడుతుందని, ప్రజలకు వైద్యసేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా
తోడ్పడుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్
జిల్లాలో అక్టోబరు 21వ తేదీన ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగిందని, ఈరోజు
నుండి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోనికి వస్తాయని తెలిపారు. పార్వతీపురం
జిల్లాలో పదహేను 104 వాహనాలతో దాదాపు 195 గ్రామ ఆరోగ్య క్లినిక్ లను కవర్
చేస్తూ ప్రారంభించిన ఈ సేవలను 19 వాహనాలతో 440 పైగా గ్రామ ఆరోగ్య కేంద్రాలకు
విస్తరించబడం జరిగిందని తెలిపారు. మిలిగిన 104 వాహనాలు నెలలో 26 రోజుల
పాటు తిరుగుతూ మారుమూల ప్రాంతాలకు ఆరోగ్య సేవలందించనున్నాయన్నారు. కుటుంబ
వైద్యుడు, అతని బృందం గ్రామంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య
సేవలు అందిస్తారన్నారు.