పల్నాడు : చిలుకలూరిపేటలో అంతా జగనన్న అని పిలిస్తే ఎక్కడో ఉన్న చంద్రబాబు
ఉలిక్కి పడాలని కార్యక్రమానికి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఏపీ వైద్య
ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. గురువారం ఫ్యామిలీ డాక్టర్
కార్యక్రమం పూర్తిస్థాయి ప్రారంభం కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా
చిలుకలూరిపేట లింగంగుంట్ల వద్ద జరిగిన బహిరంగ సభలో విడదల రజని ప్రసంగించారు.
సాధారణ బీసీ మహిళ అయిన తనకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు
మంత్రిని చేశారంటూ సీఎం జగన్‌కు విడదల రజిని కృతజ్ఞతలు తెలియజేశారామె. తన
రాజకీయ జీవితం, తన పదవులు, రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షేనంటూ సీఎం
జగన్‌ను ఉద్దేశిస్తూ భావోద్వేగంతో రజిని కంటతడి పెట్టారు. సీఎం జగన్ ఆశయాలే
లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారామె. భారత దేశ ఆత్మ గ్రామ సీమల్లోనే
ఉందని గాంధీజీ ఏనాడో చెప్పారు. పల్లె సీమలే దేశానికి పట్టుకోమలని మన సీఎం
జగన్ బలంగా నమ్మారు. అందుకే వలంటీర్ వ్యవస్థ తెచ్చారని, ఆ వ్యవస్థ
ఆత్మబంధువుల్లాగా పని చేస్తోంది. మహానగరాల్లో ధనవంతులు వినే ఫ్యామిలీ
డాక్టర్ అనే మాటను గ్రామాల్లో ఉండే పేదల కోసం ఇక నుంచి ఫ్యామిలీ డాక్టర్
ఉండబోతున్నాడని ఆమె పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణం.
ఇది జగన్ మానసపుత్రిక అని మంత్రి రజిని పేర్కొన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో వైద్య సేవలు ఉచితమని, గ్రామాల్లో పేదల ఇంటి
వద్దకే వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, అలాగే గ్రామాల్లో కూడా వైఎస్ఆర్
విలేజ్ క్లినిక్ సేవలు కొనసాగనున్నాయని ఆమె తెలిపారు. నాలుగేళ్లలో ఒక
ముఖ్యమంత్రి ఎంత చేయొచ్చో సీఎం జగన్ ఆరోగ్య రంగంలో చేసి చూపించారని మంత్రి
రజిని పేర్కొన్నారు. అయితే.. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం
ఏనాడూ ప్రజారోగ్యం గురించి ఆలోచించలేదని, పైగా ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి
పెట్టారని మంత్రి రజిని మండిపడ్డారు. పైగా దోమలపై దండయాత్ర, ఈగలపై కత్తి
యుద్ధమంటూ కాలక్షేపం చేశారో రాష్ట్ర ప్రజలు చూశారని ఆమె గుర్తు చేశారు.
పేదవాడి ఆరోగ్యం కోసం ఏనాడూ మంచి ఆలోచించలేదని, కేవలం మోసం చేయడమే పనిగా
పెట్టుకున్నారని చంద్రబాబుపై ఆమె మండిపడ్డారు.