విజయవాడ : తొమ్మిదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మచ్చ లేని పాలనతో
ఆదర్శంగా నిలుస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొనియాడారు.
బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఆవిర్భావ
దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను సోము వీర్రాజు
ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1951 అక్టోబర్‌లో భారతీయ జనసంఘ్
ఏర్పడిందని, 1980 ఏప్రిల్‌లో బీజేపీగా రూపొందిందన్నారు. యోగా దినోత్సవాన్ని
ఇంటర్నేషనల్ డేగా గుర్తించడమే కాకుండా విశ్వగురుగా మారిందని సోమువీర్రాజు
అన్నారు. ప్రపంచదేశాలలో శాటిలైట్‌కు సంబంధించిన అనేక యంత్రాలు సముద్రంలో
పడిపోతే అటువంటి వాటిని కూడా భారతదేశం కనుక్కునే స్థాయికి ఎదిగిందన్నారు.
డిఫెన్స్‌లో రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శంగా
నిలుస్తుందన్నారు. లక్షల కోట్లు ఆయుర్వేద మందులను ప్రపంచ దేశాలకు
అందిస్తున్నామన్నారు. భారతదేశంలోనే కరోనా వ్యాక్సిన్ తయారు చేసి, 120 దేశాలకు
సరఫరా చేస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ కారణంగా ఇవన్నీ భారతదేశం సాధించిన
ఘనతగా సోము వీర్రాజు పేర్కొన్నారు.