బొబ్బిలి : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు
రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకొని ముందడుగు వేసిందని స్థానిక
ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేర్కొన్నారు. గురువారం మండలంలోని
పక్కి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలను ఆయన ప్రారంభించారు.ఈ
కార్యక్రమంలో భాగంగా పక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతనంగా మంజూరైన 104
వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా
గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన
తెలియజేశారు. ఈ సేవలు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు 105 రకాల మందులు
అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామీణ
ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందాలనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ
డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. మంచానికే పరిమితమైన రోగులకు
ఆయా గ్రామాల్లోని వైద్యం అందజేయాలనే తపనతో వైసీపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్
విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఇద్దరు
డాక్టర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో 104 వాహనంతో సందర్శించి వైద్య సేవలు
అందిస్తారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ
తిరగాల్సిన అవసరం లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్
ప్రోగ్రాం ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంబంగి లక్ష్మీ,మండల పార్టీ
అధ్యక్షులు శంబంగి వేణుగోపాలనాయుడు,సర్పంచ్ గంట పైడిరాజు,వైద్యాధికారి సిహెచ్
రమేష్,పంచాయతీ వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.