ఎన్టీఆర్ జిల్లా : ఇంటి ముంగిటకే ఉచిత వైద్యసేవలు లభించునున్నాయి. రాష్ట్ర
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని నేటి నుంచి అమలు
చేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉండే ఈ విధానం ఇకపై మన
రాష్ట్రప్రజలకు కూడా అందుబాటులోకి రానుంది. జి.కొండూరు మండలం చెవుటూరు
గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట
కృష్ణప్రసాద్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు విస్తృతస్థాయిలో
మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే ప్రధాన ధ్యేయంతో ఫ్యామిలీ డాక్టర్
విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్
పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దార్శనిక పాలనకు ఇటువంటి
విధానాలు దర్పణం పడుతున్నాయన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు సీఎం జగనన్న
శ్రీకారం చుట్టారన్నారు. ఈ విధానం దేశంలోనే ఒక ఐకానిక్ గా నిలుస్తుందన్నారు.
ప్రతి సచివాలయ పరిధిలోని రెండువేల జనాభాకు ఏర్పాటు చేసిన.. డాక్టర్ వైయస్సార్
విలేజ్ క్లినిక్ వద్దకు 104 వాహనంలో మండలంలో ఉన్న పీహెచ్సీ వైద్యులలో ఒకరు
ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తారన్నారు. గ్రామంలో అవసరమైన అందరికీ వైద్య
పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేస్తారన్నారు. 14 రకాల
డయాగ్నోస్టిక్, ర్యాపిడ్ కిట్స్, 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు.
వైద్యంతో పాటుగా ఆరోగ్య శ్రీ సేవల గురించి కూడా చెబుతారన్నారు. ప్రతి పౌరుడి
ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేసి, వారి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్
చేస్తారన్నారు. ఇలా రోగికి, వైద్యులకు మధ్య అవినాభావ సంభంధం ఏర్పడి, వైద్యుల
సలహాలు, సూచనలతో రోగుల ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగు పడుతుందన్నారు. వైద్య,
ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తున్న ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు
సూచించారు. పేదలకు వైద్యసేవల కోసం బృహత్తర కార్యక్రమం చేపట్టిన సీఎం జగనన్నకు
కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ
నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.