విజయవాడ : ఇటీవల తరచూ పత్రికలలో మరియు ప్రసార మాధ్యమాల్లో గంజాయి/డ్రగ్స్
రవాణాపై వస్తున్న వరుస కధనాలపై స్పందిస్తూ, ఆర్టీసీ ఎం.డి. సి హెచ్.
ద్వారకాతిరుమల రావు అన్ని జిల్లాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో, ప్రజా రవాణా
అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ.పి.ఎస్.ఆర్టీసీ
బస్సులలో గంజాయి, గుట్కా, లిక్కర్ మరియు చట్ట విరుద్దమైన ఇతర వస్తువుల
రవాణాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్టకి భంగం కలిగించే ఎటువంటి
చర్యలనూ ఉపేక్షించేది లేదని తెలియజేశారు. కార్గో ద్వారా బుక్ చేసే
పార్శిళ్ళపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. కొంత మంది డ్రైవర్లు,
కండక్టర్లు అనుమతి లేని లగేజ్ ని తీసుకుంటున్నారని, అలా తీసుకోవడం వలన చాలా
ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బస్సులో ప్రయాణించే వారిని
సురక్షితంగా గమ్యాన్ని చేర్చవలసిన బాధ్యత డ్రైవర్లపై ఉందని, సిబ్బంది తమ
ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని తెలిపారు. మంచిగా, నిజాయితీగా నడుచుకునే
సిబ్బంది పట్ల మంచిగానే ఉంటామని, ఎవరైనా అవినీతికి పాల్పడినా, ఆర్టీసీ
ఆదాయానికి గండి కొట్టే చర్యలు చేసినా, సంస్థ పేరు చెడగొట్టేలా ప్రవర్తించినా
వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఆర్టీసీ యొక్క అన్ని కౌంటర్లలో గంజాయి, మత్తు పదార్ధాలు, పేలుడు పదార్ధాలు,
చట్ట బద్దంగా నిషేదించబడిన ఏ వస్తువులనూ అనుమతించ రాదని హెచ్చరికలు జారీ
చేశారు. పార్శిళ్ళపై నిఘా ఉంచాలని, ఇకపై బుక్ చేసే ప్రతి పార్శిల్ ను
క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి కార్గో
సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాలని వివరించారు. నిషేదిత వస్తువులను బుకింగ్
చేయడానికి ప్రయత్నించిన వారి సమాచారాన్ని, వివరాలను వెంటనే పోలీసులకు సమాచారం
అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా వినియోగదారుని
ఆధార్ గుర్తింపు కార్డు, అడ్రస్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని, అదే
విధంగా పార్శిల్ అందుకునే వారి పూర్తి వివరాలు నమోదు కూడా తప్పనిసరి చేయాలని
ఆదేశాలిచ్చారు. సిబ్బంది విధుల పట్ల నిబద్దతతో ఉండాలని సూచించారు. ఈ
కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి
(ఆపరేషన్స్), ఏ. కోటేశ్వరరావు( అడ్మిన్) , ఓ.ఎస్.డి. (సి & ఎల్) రవి వర్మ,
సి.టి.ఎం. (కమర్షియల్) చంద్రశేఖర్, సి.టి.ఎం.(ఓ) నాగేంద్ర ప్రసాద్,
త్రినాధ్( డిప్యూటీ సి.టి.ఎం.), ఇంకా అన్ని జోన్ల అధికారులు, జిల్లా ప్రజా
రవాణా అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.