విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలన పేదలలో
కొండంత ధైర్యాన్ని నింపిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సోమవారం 63 వ డివిజన్ 278 వ వార్డు
సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ
మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి
ఆయన పాల్గొన్నారు. పాత రాజీవ్ నగర్లో విస్తృతంగా పర్యటించి 250 గడపలను
సందర్శించారు. దుకాణదారులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు ఇలా అన్ని వర్గాల
ప్రజలతో మమేకమై పాదయాత్ర కొనసాగించారు.
రికార్డు స్థాయికి సామాజిక పింఛన్లు
సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ కు
ధీటుగా రాలేదని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నికల ముందు వరకు
కేవలం రూ.వెయ్యి మాత్రమే పింఛన్ ఇచ్చే వారని గుర్తుచేశారు. కానీ నేడు
ఒక్కొక్కరికీ రూ.2,750 చొప్పున అందిస్తుండటంతో అవ్వాతాతల మోముల్లో ఆనందం
వెల్లివిరుస్తోందని చెప్పారు. అలాగే పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు
తగ్గించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. పైగా ఏడాదికి రెండుసార్లు జూలై
మరియు జనవరి మాసాలలో నూతన పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ
ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లను ఇచ్చిందని..
కానీ ఈ ప్రభుత్వంలో 63.66 లక్షల మందికి అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇందుకోసం నెలకు రూ. 1,754 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు.
ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 26,418 మందికి ప్రతినెలా రూ. 7 కోట్ల 18 లక్షల
24 వేల 500 పింఛన్ రూపంలో అందిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు.
‘వై నాట్ 175’ ను భగ్నం చేసే కుట్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై వైఎస్సార్ సీపీ శాసనసభ్యులందరూ
పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉన్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది
విష్ణు అన్నారు. తమ బాటలోనే మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఆనం రామనారాయణరెడ్డి
చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘వై నాట్ 175’ భగ్నం చేసే టీడీపీ
కుట్రలో భాగంగా ఇటువంటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే
టీడీపీ నేత నారాలోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని మల్లాది విష్ణు సూచించారు.
ప్రజలంతా జగనన్న పాలన శభాష్ అంటూ కీర్తిస్తుంటే.. చూసి ఓర్వలేనితనంతో పచ్చ
నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ధైర్యముంటే పంచాయతీ రాజ్ మంత్రిగా
సాధించిన ప్రగతి, ఇచ్చిన పింఛన్లపై లోకేష్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
చేశారు. అంతేగాని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి
నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని మరోసారి తగిన రీతిలో
బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.