విజయనగరం : బాలల కోసం ప్రతి జిల్లాలో అబ్జర్వేషన్ హోం(పునరావాస
కేంద్రం) వుండాలనేది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లక్ష్యమని
కమిషన్ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో
అబ్జర్వేషన్ హోంలు లేనిచోట వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు
చేస్తున్నట్టు వెల్లడించారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ తో పాటు
తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి తదితర ఐదు రాష్ట్రాల్లో 22
జిల్లాలను తాను అబర్జర్వేషన్ హోంల ఏర్పాటు కోసం సందర్శిస్తున్నట్టు
పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఇవి లేనట్లు గుర్తించామన్నారు. నగరంలోని
జిల్లాపరిషత్ అతిథిగృహంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
సభ్యులు డా.ఆనం సోమవారం రాష్ట్ర బాలహక్కుల కమిషన్ అధ్యక్షుడు కేశలి
అప్పారావుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో బాలలపై నేరాలు
లేనప్పటికీ బాలల పునరావాస గృహం ఏర్పాటు చేయడం అవసరమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌తో
కలసి కార్యక్రమాలు చేస్తున్నామని, రాష్ట్ర కమిషన్ పూర్తి సహకారాన్ని
అందిస్తోందన్నారు. రాష్ట్రంలో బాలల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రధానమంత్రి
నరేంద్రమోడి ఆశయాలను నెరవేర్చే దిశగా కృషిచేస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లాను డ్రగ్స్ రహితంగా, బాల్య వివాహాలను లేని జిల్లాగా రూపొందించే
దిశగా రాష్ట్ర కమిషన్ తో కలసి సంయుక్త కార్యాచరణ చేపడుతున్నట్టు
తెలిపారు. చైల్డ్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడమే
లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఒక రోజు జిల్లా ఆకస్మిక పర్యటన కోసం
సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న బాలల హక్కుల కమిషన్ జాతీయ సభ్యులు
డా.ఆనంద్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారిని కలిసి
జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న చర్యలపై చర్చించారు.
నగరంలోని దిశ పోలీస్ స్టేషన్ ను సందర్శించి మహిళలపై అకృత్యాలను
నిరోధించేందుకు చేపడుతున్న చర్యలను డి.ఎస్.పి. ఎం.వెంకటేశ్వర్లు ద్వారా
తెలుసుకున్నారు. దిశ యాప్ గురించి బాలికలు, మహిళలపై అత్యాచారాల నిరోధానికి
దిశ యాప్ ద్వారా సాధిస్తున్న ఫలితాలపై డి.ఎస్.పి. వెంకటేశ్వర్లు
వివరించారు. నగరంలోని కొత్త ధర్మపురిలో వున్న ప్రభుత్వ బాలుర పరిశీలన
గృహం సందర్శించి బాలుర పరివర్తన, వారి పునరావాసానికి చేపడుతున్న
చర్యలు, అబ్జర్వేషన్ హోం ఏర్పాటుకు గల అవకాశాలపై పరిశీలన చేశారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేశలి అప్పారావు,
జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, మహిళాశిశు సంక్షేమశాఖ జిల్లా
అధికారిణి శాంతకుమారి, డి.ఎస్.పి. వెంకటేశ్వర్లు, బాలల హక్కుల కమిషన్
జిల్లా అధ్యక్షురాలు హిమబిందు తదితరులు పాల్గొన్నారు.