పోస్ట్ కార్డు ఉద్యమం మొదలెట్టారు. ‘మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి మోడీ
గారు’ అంటూ పోస్ట్ కార్డుపై ప్రశ్నావళి సంధించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్
నేతలు మోయిప్పన్, గిడుగు రుద్రరాజు, జెడి శీలం, సుంకర పద్మశ్రీ తదితరులు
పాల్గొన్నారు. ఏఐసీసీ నేత మోయిప్పన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి
పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని నరేంద్ర మోడీలో భయం పట్టుకుందన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు.
నీరవ్ మోదీ, లలిత్ మోదీలు మోసాలు చేయలేదా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో
అదానీ అక్రమాలపై ప్రశ్నించడం తప్పా అన్నారు. మోడీ , అదానీల అవినీతి గురించి
బయటకు రాకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ను
ప్రజల నుంచి దూరం చేసే సత్తా ఎవరికీ లేదని, 2024 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం
సాధించడం ఖాయమని, నరేంద్ర మోడీ అమిత్ షాలకు ప్రజలు బుద్ది చెప్పి పంపిస్తారని
మోయిప్పన్ వ్యాఖ్యానించారు.వారి అక్రమాలను ప్రశ్నించే వారిపై వ్యవస్థలతో దాడిచేయిస్తారా? : ఏపీసీసీ
అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ విషయంలో మోడీ
కక్ష సాధింపు చర్యలను దేశ ప్రజలంతా తప్పు పడుతున్నారన్నారు. అదానీ, మోడీ ల
బంధం నిజం కాదా. ప్రపంచ ధనికుల్లో రెండో స్థానంలోకి అదానీ ఎలా వచ్చారని
ప్రశ్నించారు. నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు అదానీ సౌకర్యాలు సమకూరుస్తారని,
అందుకే దేశం, బయటి దేశాల్లో కూడా కాంట్రాక్టులు అదానీకే కట్టబెడుతున్నారని
ఆరోపించారు. వారి అక్రమాలను ప్రశ్నించే వారిపై వ్యవస్థలతో దాడిచేయిస్తారా?
అంటూ ప్రశ్నించారు. సిబిఐ, ఈడీ, న్యాయ స్థానాలను అడ్డం పెట్టుకుని ఇబ్బంది
పెడుతున్నారని, ఎప్పుడో మాట్లాడిన మాటలను సాకుగా చూపి శిక్ష వేయించారని
మండిపడ్డారు. అనర్హత వెనుక రాజకీయ కుట్ర ఉందన్న విషయం అందరికీ అర్ధమైందన్నారు.
ఈ పోస్టు కార్డు ఉద్యమం ద్వారా దేశ ప్రజలందరినీ ఏకం చేస్తామన్నారు. నెల రోజుల
పాటు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని గుడుగు రుద్రరాజు
స్పష్టం చేశారు.
అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి : సుంకర పద్మశ్రీ
సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ
వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను అడ్డు పెట్టుకుని
అడ్డగోలుగా పని చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ అంశంలో తప్పకుండా
న్యాయం గెలుస్తుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి మోదీలో భయం
పట్టుకుందన్నారు. సత్యమేవజయితే. తప్పకుండా సత్యం గెలుస్తుందని, మోదీ, అమిత్
షాల మోసాలు ప్రజలకు అర్ధ మవుతున్నాయన్నారు.