వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ : భారతదేశం ఎగుమతుల్లో ప్రపంచ వేదికపై సత్తా చాటుతూ 750 బిలియన్
డాలర్ల మైలురాయిని దాటిందని, స్వతంత్ర భారతదేశంలో 75 వ వసంతంలో ఈ ఘనత
సాధించడం గర్వించదగ్గ విషయమని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా
గురువారం పలు అంశాలు వెల్లడించారు. ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను చేరుకోవడానికి
భారతదేశానికి ఎంతో సమయం పట్టదని అన్నారు. ఈ సందర్బంగా ఎగుమతి దారులందరికీ
అలాగే వీరిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర
వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమర్ధ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని
తెలిపారు. యూపీఐ ద్వారా నిర్వహించు లావాదేవీలపై తప్పుగా అర్థం చేసుకున్న 1.1%
చార్జీలకు సంబంధించి ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)
ప్రజలకు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని విజయసాయి రెడ్డి
అభిప్రాయపడ్డారు. అత్యధిక శాతం ప్రజలు చేస్తున్నట్లు ఒక బ్యాంకు అకౌంట్ నుంచి
మరో బ్యాంకు అకౌంట్ కు లావాదేవీలు నిర్వహించేందుకు యూపీఐ ఉచితంగా అందుబాటులో
ఉండాలని అన్నారు. యూపీఐ పట్ల ప్రజల్లో ఉన్న జనాదరణ అలాగే కొనసాగేందుకు
లావాదేవీలు పూర్తి ఉచితంగా మరింత నమ్మకంగా కొనసాగాలని ఆయన అన్నారు.