నెల్లూరు : మానవ అభివృద్ది కోసం నిర్ధేశించిన సుస్థిర అభివృద్ది లక్ష్యాల
సాధనకు అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం వుందని రాష్ట్ర
ప్లానింగ్ శాఖ కార్యదర్శి జి.ఎస్ ఆర్.కే.ఆర్. విజయ కుమార్ పేర్కొన్నారు.
బుధవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర కస్తూరిభా కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రణాళిక
శాఖ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయి అధికారులతో సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనకు
తీసుకోవాల్సిన చర్యలు, స్పందన పై వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది. ఈ
సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ కుమార్ మాట్లాడుతూ ధనిక,
పేదల మధ్య తీవ్రస్థాయిలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి
2016- 2030 మిలీనియం సమీకృత అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు.
అందులో బాగంగా పేదరికం, ఆకలి నివారించి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన
త్రాగునీరు అందించడం వంటి అంశాలతో కూడిన లక్ష్యాల సాధనకు ప్రపంచ వ్యాప్తంగా
8 అంశాలు, 18 లక్ష్యాలు, 56 సూచికలుతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం ప్రధాన అడ్డంకిగా మారిందని
యునిసేఫ్ గుర్తించి, అందుకు అనుగుణంగా పలు ప్రతిపాదనలతో కూడి సూచికలు ఇవ్వడం
జరిగిందని ఆయన అన్నారు. ఏ పని ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం
అని ఆత్మావలోకనం చేసుకోవాలని, నిజమైన అభివృద్ధికోసం పని చేస్తున్న అవకాశం
వచ్చినందుకు అదృష్టంగా భావించి ఇష్టంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని
పేర్కొన్నారు. ముందుగా ఎస్.డి.జి లక్ష్యాలను ఎందుకు పెట్టవలసి వచ్చింది, వాటి
ఉద్దేశ్యాలను పూర్తిగా అర్ధం చేసుకోవాలని అన్నారు. దుర్భర పేదరికం, ఆకలి
ప్రాలద్రోలడం, ప్రాథమిక విద్య, లింగ సమానత్వం, పిల్లల్లో పౌష్టిక విలువలు,
శిశు మరణాలు, గర్భిణీ మరణాలు, వ్యాధులు, పర్యావరణ కాలుష్యం, త్రాగునీరు,
పరిశ్రమలు, కనీస అవసరాలు తీర్చడం, అవినీతికి తావులేకుండా చూడడం, సమన్యాయం,
సమానత్వం, తదితర పలు అంశాలను అధ్యయనం చేసి వాటిని సమర్థవంతంగా రూపుమాపడానికి
కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలుకు కృషి చేయాలని పేర్కొనడం
జరిగిందన్నారు.