కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా
పక్షపాతిగా అన్ని సంక్షేమ పథకాలను మహిళలకు అందించడం జరుగుతోందని, తద్వారా
రాష్ట్రంలో మహిళాభివృద్ధి ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా పేర్కొన్నారు. స్థానిక బళ్లారి రోడ్డు నందు గల
ఆయేషా స్కూల్ వెనుకవైపు ఉన్న మైదానంలో నగరపాలక సంస్థ, మెప్మా వారి ఆధ్వర్యంలో
3వ విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి యస్ బి అంజాద్ బాషా ముఖ్య అతిథిగా
పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళాభివృద్ధే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్
రెడ్డి ప్రభుత్వ ధ్యేయంగా కడప నగర పట్టణ లోని మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో
పలు ప్రాంతాలకు సంబంధించి “వై.యస్.ఆర్ ఆసరా” కార్యక్రమాన్ని మూడవ సంవత్సరం
కూడా మీ చల్లని ఆశీస్సులతో ఈ రోజు పొదుపు సంఘాల ఖాతాలలో 9290 మంది
లబ్ధిదారులకు రూ.7 కోట్ల, 71 లక్షల, 35 వేలు జమ చేయడం జరుగుతున్నందుకు నేను
ఎంతగానో సంతోషిస్తూ అక్క చెల్లెమ్మలందరికి హృదయపూర్వక అభినందనలు
తెలుపుకొనుచున్నానని అన్నారు. ఎన్నికల
మేనిఫెస్టోక్ట్ లో చెప్పిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి “ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం
సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం” అని ఇచ్చిన హామీని అక్షరాల
పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడతగా రూ.6,318.76 కోట్లు
చెల్లించడం జరిగిందన్నారు. తద్వారా 78.76 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ది
చేకూరింది. రెండో విడతగా 78.76 లక్షల అక్క చెల్లెమ్మలకు మరో రూ. 6.439.52
కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పుడు మరల అక్క చెల్లెమ్మలకు మరో రూ
6,419.89 కోట్లు మూడవ విడతగా ఈ రోజు అందిస్తున్నమని, ఇప్పటివరకు మూడు విడతలలో
మొత్తం రూ. 19.178.17 కోట్లు 78.94 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ది చేకూరిందని
తెలిపారు. అక్క చెల్లెమ్మల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి
కుటుంబంలో సుస్థిరమైన ఆదాయం రావాలని, మీకు మీరుగా సృష్టించుకునే వ్యాపార,
జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని మీరు ఆర్థికంగా అభివృద్ధి
చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ
పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు.