గుంటూరు : ఏప్రిల్15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి
అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి ఆదేశించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేయాలని
కోరారు. అకాల వర్షాలు వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్ స్ధితి గతులను అడిగి
తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ జరుగుతోందని, ఏప్రిల్ మొదటి వారంలో నివేదిక
ఖరారుచేస్తామని, ఏప్రిల్ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను
విడుదలచేస్తామని సీఎంకు అధికారులు వివరించారు వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను
పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. బుధవారం వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ
అంశాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష
నిర్వహించారు.
రబీ సన్నాహకాలపైన సీఎం సమీక్ష
ఇప్పటికే 100శాతం ఇ క్రాపింగ్ పూర్తైందని అధికారులు తెలిపారు. నాణ్యతలేని
ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు లేకుండా చూడాలని
అధికారులకు సీఎం
ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు
అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు
నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలని అన్నారు. సీఎం
ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీచేస్తున్నామని
అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా 2023–24లో 10.5లక్షల మెట్రిక్
టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఎరువులతో పాటు ఏపీ
ఆగ్రోస్ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు
చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. నకిలీ, నాణ్యతలేని పురుగుమందులు లేకుండా
చేయడానికి ఇది దోహదపడుతుందని అధికారులు వెల్లడించారు.
పొలంబడి శిక్షణ
పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్న అధికారులు
ఆర్బీకేల ద్వారా ఆయా రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ
ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15శాతం, పత్తిలో
12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయని, పత్తిలో 16శాతం,
మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9శాతం దిగుబడులు పెరిగాయని,
పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు అని
అధికారులు వివరించారు. 26 ఎఫ్‌పీవో (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) లకు
జీఏపి (గుడ్‌అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు
చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
వ్యవసాయ పరికరాల పంపిణీ
రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందని, ఏప్రిల్‌లో ఆర్బీకేల్లోని 4225
సీహెచ్‌సీలకు యంత్రాల పంపిణీ చేస్తామని, జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్ కల్లా
మరో 1500 డ్రోన్లు పంపిణీ, జులై లో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్ మధ్య
మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
మిల్లెట్స్ సాగుపై చర్యలు
రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ఆదేశాలమేరకు అనేక
చర్యలు తీసుకున్నామన్న అధికారులు 19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున
మిల్లెట్ క్లస్టర్లు పెట్టామని అధికారులు పేర్కొన్నారు. 3 ఆర్గానిక్
క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి
సాగును ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు 2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో
ఎగుమతి చేయదగ్గ వరి రకాలను సాగుచేస్తున్నామని అధికారులు వివరించారు.
దాదాపు 6.29 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యిందని,
2022–23 రబీలో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను సాగుచేశారని, 3.79
లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందని అధికారులు వెల్లడించారు. ఆర్బీకేల్లో
కియోస్క్‌ల సేవలు పూర్తిస్థాయిలో రైతులకు అందాలని, దీనిపై ఎప్పటికప్పుడు
సమీక్ష చేయాలన్న సీఎం ఉద్యానవన పంటల మార్కెటింగ్ పై ప్రత్యేక
దృష్టిపెట్టాలన్నారు. కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్న కొద్దీ మార్కెటింగ్
ఉదృతంగా ఉండాలని, దీనివల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులు
ఉండవని, మంచి ఆదాయాలు కూడా వస్తాయని తెలిపారు.
ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్
ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వీలైనంత త్వరగా
అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై
పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ఫలితాలు ఆధారంగా పాటించాల్సిన సాగు
విధానాలపై అవగాహన తదితర అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించుకోవాలన్నారు.
ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసేదిశగా చర్యలు
తీసుకోవాలని, జూన్‌లో ఖరీఫ్ నాటికి పరీక్షల ఫలితాలు ఆధారంగా రైతుకు సాగులో
పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలన్నారు. పంటలకు
అవసరమైన స్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు ఉండాలని, ప్లాంట్ డాక్టర్
కాన్సెప్ట్. ఆర్బీకేల కార్యక్రమాలను ఒక దశకు తీసుకెళ్తాయని అన్నారు.