వారు చెప్పింది విని జగన్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యొద్దు: ధర్మాన
శ్రీకాకుళం : ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న దొంగలందరూ మీ ఇళ్ల పక్కన, మీ
వీధుల్లో, మీ ఊరిలోనే ఉన్నారని, వారు చెప్పింది విని ముఖ్యమంత్రి జగన్
మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి మీ చేతులు మీరే నరుక్కోవద్దని ఏపీ మంత్రి
ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గారలో వైఎస్సార్ ఆసరా
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తరతరాలుగా ఉన్న ఆధిపత్యం పోయిందన్న ధర్మాన ప్రసాద రావు ఎన్నికలకు ఇంకో
సంవత్సరం సమయం ఉందని, ఆ తర్వాత ఇంకొకరికి ఓటు వేస్తే ఈ కార్యక్రమాలన్నీ
అగిపోతాయని అన్నారు. ఓటు ద్వారా మరోమారు వైసీపీకి అధికారం ఇవ్వాలన్నారు.
ప్రస్తుతం అందుకుంటున్న పథకాలు, పొందుతున్న గౌరవం, కుటుంబ హోదా పెరగడం,
పిల్లలు హాయిగా చదువుకోవడానికి కారణమైన వ్యక్తి, పార్టీ, ఆ పార్టీ గుర్తు మీకు
జ్ఞాపకం ఉండాలని అన్నారు. మీ కుటుంబం పొందుతున్న గౌరవం, ఆనందానికి కారణమైన
వ్యక్తిని పిచ్చోడని, సైకో అనే అంటే నమ్ముతారా? అని ధర్మాన ప్రశ్నించారు.
ప్రయోజనం పొందుతున్న పార్టీని నిలబెట్టాలని కోరారు.