ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి,
ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ
ఆధ్వర్యంలో స్ధానిక ఇండోర్ స్టేడియం వద్ద సోమవారం ఫ్యామిలీ ఫిజీషియన్
కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కొత్తగా మంజూరైన 16 కొత్త 104 సర్వీసు వాహనాలను
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న
వెంకటేష్ జెండాఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ
కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రజలకు మరింత
చేరువ చేసే దిశగా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
ప్రజలకు మెరుగైన్ వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.
రాజశేఖరరెడ్డి 104, 108 సర్వీసులతోపాటు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకువచ్చి
ఎంతోమంది ప్రాణాలను కాపాడారన్నారు. అయితే అటువంటి కార్యక్రమాన్ని గత
ప్రభుత్వం నిరుపయోగం చేసిందన్నారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా
చెల్లించలేని పరిస్ధితి తీసుకవచ్చిందన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజారోగ్యానికి భరోసా కల్పించే
కార్యక్రమాలను సమర్ధవంతంగా చేపట్టడం జరిగిందన్నారు. పెద్దఎత్తున 108,104
సర్వీసు వాహనాల ను అందుబాటు లోనికి తీసుకురావడం తో పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
కింద వైద్యం పొందిన రోగులకు సంబందించి నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులు మంజూరు
చేసి ఎన్నో లక్షల మంది ప్రజల ప్రాణాలను కాపాడరన్నారు.అంతే కాకుండా ఫ్యామిలీ
ఫిజీషియన్ ద్వారా ప్రజలకు మెరుగైన్ వైద్యాన్ని చేరువచేయడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగానే 104 సర్వీసు వాహనాలను ఇప్పటికే జిల్లా 27 అందించగా ఈరోజు మరో
16 కొత్త వాహనాలను సమకూర్చడం జరిగిందన్నారు. కొన్ని మండలాల్లో ఎక్కువ పిహెచ్
సిలు ఉండడం, పిహెచ్ సి పరిధికూడా ఎక్కువగా ఉన్నవాటిని దృష్టిలో ఉంచుకొని ఆయా
గ్రామాలకు వైద్యాన్ని పూర్తిస్ధాయిలో అందించేందుకు కొత్త వాహనాలను
అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ ప్రతి పేదవాని గడప దగ్గరకే
వెళ్లి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే సచివాలయాల పరిధిలో
వై.ఎస్.ఆర్. హెల్త్ క్లీనిక్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్కడ వైద్య
సిబ్బంది ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఆప్రాంతంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంపై
నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. పేద ప్రజలకు ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా
మెరుగైన వైద్యాన్ని మెడికల్ ఆఫీసరు ద్వారా చేరువ చేయడం జరుగుతుందన్నారు.
దానిలో భాగంగా ఇప్పటికే 27 మండలాల్లో 104 సర్వీసు వాహనాలు అందుబాటులో ఉండగా,
మండలంలోని ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో 2 సార్లు పరిపూర్ణంగా వైద్య సేవలు
అందించేందుకు మరో 16 కొత్త 104 సర్వీసు వాహనాలను జిల్లాకు ప్రభుత్వం ఇవ్వడం
జరిగిందన్నారు.