అమరావతి : తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి.
మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైసీపీ సభ్యుల సంఖ్య
ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారితో కలిపి) 44కు
చేరుకోనుంది. ప్రతిపక్ష టిడిపి సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది.
పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం
కానుంది. బీజేపీకి ఉన్న ఒక్క సభ్యుడూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ
మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది. తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల
కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2, మొత్తంగా 21 స్థానాలు
ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైసీపీ, 4 స్థానాలు టీడీపీ దక్కించుకున్నాయి.
టీడీపీ కి చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో
పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు. వైసీపీ కి
చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ
పార్టీకి చెందిన 17 మంది గెలిచారు.