విజయవాడ : రాష్ట్రంలో పశుపోషకులకు తక్కువ ధరలకు నాణ్యమైన పశువుల జనరిక్
మందులను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 52 పశు ఔషద కేంద్రాలను ఏర్పాటు
చేస్తున్నామని పశుసంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్య శాఖ మంత్రి సీదిరి
అప్పలరాజు అన్నారు. విజయవాడ లబ్బి పేటలోని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాలయ
ఆవరణలో డా.వై.యస్.ఆర్. పశుఔషద నేస్తం పధకంలో భాగంగ ఏర్పాటు చేసిన పశు ఔషద
జనరిక్ కేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి
అప్పలరాజు మాట్లాడుతు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జనరిక్ డ్రగ్ స్టోర్‌ను
మన రాష్ట్రంలో మొదటగా ఏర్పాటు చేసామన్నారు. రైతులకు అన్నిరకాల మందులు ఈ పశు
ఔషద కేంద్రంలో అందుబాటులో ఉంటాయన్నారు. పశు సంవర్ధక శాఖలో చేపట్టిన విన్నూత్న
కార్యక్రమాల ద్వారా పశు పోషకులకు, రైతులకు మైరుగైన సేవలందింస్తున్నామన్నారు.
పశు వైద్యానికి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని, వెటర్నరి
అంబులెన్స్‌లకు స్కోచ్ అవార్డులు లబించడం గర్వకారణం అన్నారు. రాష్ట్రంలో
గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా పశు పోషకులకు, పెంపుడు
జంతువుల యజమానులకు అన్ని రకాల మందులు జనరిక్ విభాగంలో అందుబాటులో ఉంచామన్నారు.
డా.వై.యస్.ఆర్. పశు ఔషద నేస్తం పధకం ద్వారా ఔషద కేంద్రాల ఏర్పాటుకు ఔత్యాహిక
వ్యాపారవేత్తలు, పశుపోషకులు, జాయింట్ లైబలిటీ గ్రూపులు, స్వయం సహాక సంఘాలు,
రైతు ఉత్పత్తి కేంద్రాలు, ఆసక్తి కలిగిన ఇతరులను ఈ పధకంలో లబ్ధిదారులుగా
గుర్తిస్తామన్నారు.
జనరిక్ ఔషద కేంద్రాల ఏర్పాటుకు రూ.4,63,000 యూనిట్ ఖర్చుగా నిర్ధారించామని
వాటిలో 75 శాతం ప్రభుత్వం అందిస్తుందని. లబ్ధి దారుని వాటగా 25 శాతం
చెల్లించవలసి ఉంటుందన్నారు. పశు ఔషద కేంద్రాలలో నాణ్యమైన పశువుల మందులను
సరసమైన ధరలకు అందిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా పశు వైద్య శాలలో ఔషద కేంద్రాల
ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే కేటాయిస్తుందన్నారు. ప్రభుత్వం ఎంపిక
చేసిన లబ్ధి దారులచే పశు ఔషద కేంద్రాల కార్యాకలపాలు నిర్వహిస్తామన్నారు. పశు
వైద్యులు జనరిక్ మందులు మాత్రమే ప్రోత్యహించేవిధంగా అవసరమైన సహకారాన్ని
అందిస్తారన్నారు. జనరిక్ మందుల ప్రాముఖ్యత వినియోగంపై అవగాహన సదస్సులు
నిర్వహించి పశు పోషకులకు, పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కల్పిస్తున్నామని
మంత్రి అప్పలరాజు అన్నారు.
అనంతరం వెటర్నరి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌ను అధికారులతో కలిసి మంత్రి
పరిశీలించారు. ఈ సందర్భంగా పెంపుడు జంతువుల యజమానులకు, రైతులకు అందుతున్న పశు
వైద్య సేవలను సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా ఆసుపత్రులను
రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచన అన్నారు. పశు
సంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాలయాల్లో పలు విభాగాల్లో మంత్రి పరిశీలించి
అధికారులకు తగు సూచనలను చేశారు.