సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు
విజయవాడ : కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో దళితవాడపై
దాడిచేసి, నడిపల్లి రాము అనే యువకుడిని హత్య చేసిన అగ్రకుల దురహంకారులను
అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో కోరారు. తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో
జరుగుతున్న గ్రామ దేవత జాతరకు వెళ్ళిన దళిత యువకులపై కులదురహంకారంతో దాడి
చేయడమే కాక దళిత పేటలోకి వెళ్ళి ఇళ్ళలో ఉన్నవారిపై దాడి చేసి అనేక మందిని
గాయపరిచడం దారుణమన్నారు. ఈ దాడిలో దళిత యువకుడు నడిపల్లి రాము మృతి చెందాడని
తెలిపారు. ఈ దాడికి నాయకత్వం వహించిన ముఖ్యుల్ని ఇంత వరకూ అరెస్టు చేయకుండా
పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోన్నారని విమర్శించారు. భాధిత
కుటుంబాలకు రక్షణ కల్పించడంతోపాటు, గాయపడిన వారికి మెరుగైన వైద్యం
అందించాలన్నారు. పల్లెలో పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మృతుడు రాము కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియో, రెండు ఎకరాలు భూమి,
ఉద్యోగం, ఇంటి స్థలం, ఇల్లు కట్టి ఇవ్వాలని, బాధితులకు రూ.10 లక్షల
నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలు పునావతం కాకుండా
దళితులకు రక్షణ చర్యలు తీసుకోవాలని జస్టిస్పున్నయ్య కమీషన్ సిఫార్సుల
ప్రకారం కలెక్టర్, ఎస్పీలు శృంగవృక్షం గ్రామాన్ని సందర్శించి చర్యలు
తీసుకోవాలని డిమాండ్ చేశారు.