పెద్దపీట వేస్తూ 2023 – 27 పారిశ్రామిక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం
ప్రవేశపెట్టింది. ఇందుకోసం తొమ్మిది మిషన్లను నిర్దేశించుకుని పూర్తిస్థాయి
పారిశ్రామిక ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేలా పాలసీలో పలు ప్రతిపాదనలు చేశారు.
పరిశ్రమలకు తక్కువ వ్యయంతో అన్ని మౌలిక వసతులతో కూడిన భూములను అందుబాటు ధరల్లో
అందించనున్నారు. ఇందుకోసం నాలుగేళ్లలో మూడు లక్షల ఎకరాల భూమిని సేకరించాలని
నిర్ణయించారు. పబ్లిక్, ఫ్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక
వసతుల అభివృద్ధితో పాటు స్టార్టప్‌లు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను
అందించేలా ప్రత్యేక వ్యవస్థను ప్రోత్సహించనున్నారు. ఇదే సమయంలో అత్యధికంగా
ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలతోపాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా పాలసీని రూపొందించారు.సమానంగా అభివృద్ధి చెందేలా : నాలుగేళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం
ప్రవేశపెట్టిన 2023 – 27 పారిశ్రామిక పాలసీ ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి
అమల్లోకి రానుంది. గత మూడేళ్లలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుంటూ
అంతర్జాతీయ మార్కెట్లకు సేవలు అందించేలా కొత్త పాలసీని రూపొందించినట్లు
పరిశ్రమలు, మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల
వలవన్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా పారిశ్రామికంగా
అభివృద్ధి చెందే విధంగా పాలసీలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో
భాగంగా జిల్లాల వారీగా వివరాలు సేకరించి పరిశ్రమలు తక్కువగా ఉన్న చోట్ల
మరిన్ని ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రతిపాదన నుంచి ఉత్పత్తి దాకా : రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన
దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు సింగిల్ విండో విధానంలో త్వరితగతిన
అన్ని అనుమతులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. భూముల కోసం పరిశ్రమలు దరఖాస్తు
చేసుకున్న 21 రోజుల్లోనే ఏపీఐఐసీ భూమిని కేటాయిస్తుంది. పరిశ్రమలకు 33-66 ఏళ్ల
కాలానికి లీజు విధానంలో భూమిని కేటాయిస్తారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన
10 ఏళ్ల తర్వాత భూములను కొనుగోలు చేసుకునే హక్కును కల్పించనున్నారు. ప్రభుత్వ
సేవలన్నీ ఒకే గొడుగు కింద అందించే విధంగా వైఎస్సార్ ఏపీ వన్ వ్యవస్థను
అభివృద్ధి చేశారు. ఎంఎస్ఎంఈలు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు
లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి సామర్థ్యం, ఉపాధి కల్పనను
బట్టి రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పిస్తారు. మెగా, అల్ట్రా మెగా
ప్రాజెక్టులకు సంబంధించి వేగవంతంగా కార్యరూపం దాల్చేలా సీనియర్ అధికారిని
ప్రత్యేకంగా కేటాయిస్తారు. ప్రాజెక్టు అమలులో ఈ అధికారి అంబాసిడర్‌గా
వ్యవహరిస్తారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలను
త్వరితగతిన వాస్తవ రూపంలోకి తెచ్చేలా సీఎస్ అధ్యక్షతన కమిటీని నియమించిన
రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది.
ఒప్పందం జరిగిన రోజు నుంచి ఆర్నెల్లలో నిర్మాణ పనులు ప్రారంభించే సంస్థలకు
ఎర్లీ బర్డ్ కింద ప్రోత్సాహకాలను కల్పించనున్నారు.