రాజమండ్రి : విద్యార్థులలో రక్త హీనత, శారీరక బలహీనత ఎక్కువగా ఉంటోందని,
పౌష్టికాహారాన్ని స్వీకరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్
విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సూచించారు. మంగళవారం రాజానగరం మండలం
పుణ్యక్షేత్రం జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని
చేపట్టింది. ఇందులో భాగంగా పుణ్యక్షేత్రం హైస్కూలులో నిర్వహించిన రాగి జావ
పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డాక్టర్
కే మాధవీలత, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా ఛైర్పర్సన్ మేడపాటి
షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ
ప్రభుత్వ స్కూల్స్ లో వారానికి మూడు రోజుల పాటు రాగి జావను అందిస్తారని
చెప్పారు. జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 987
పాఠశాలల్లోని1,25,785 మంది విద్యార్థులకు రాగి జావ అందించనున్నామని తెలిపారు.
అనంతరం విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు రాగి జావ
తాగారు.