పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపుతో భారీ అంచనాలు
పీడిఎఫ్ సాయంతో గెలిచి స్వయంప్రతిభ అంటూ గొప్పలు
అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం ఉండదు : ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : పట్టభద్రుల నియోజకవర్గాల ఎంఎల్సీలలో మూడింటిని కైవశం చేసుకున్న
టీడీపీ నేతలు అప్పుడే ఊహల పల్లకిలో ఊరేగుతూ గాలిమేడలు కట్టేస్తున్నారు. శాసనసభ
ఎన్నికల్లో ఇక తమకు ఎదురులేదనే విధంగా సొంత మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ
చంకలు గుద్దుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థ్లల కోటా ఎమ్మెల్సీ,
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న
ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో ఉంది. మూడు చోట్ల మాత్రమే జరిగిన పట్టభద్రుల
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అతి కష్టం మీద గెలుపొందింది. ఈ ఎన్నికల ప్రభావం
అసెంబ్లీ ఎన్నికలపైన ఉంటుందనీ, ఇవే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లోనూ రిపీట్
అవుతాయని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ మాత్రం ఈ వాదనతో
విభేదిస్తోంది. టీడీపీ రెండో ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కిన విషయాన్ని.. అందునా
పీడీఎఫ్ నుంచి భారీగా బదిలీ అయిన ఓట్ల అంశాన్ని గుర్తు చేస్తోంది. తమ
అభ్యర్దుల ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం ఉండదు : వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన
కృష్ణదాస్
ఈ ఫలితం అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదని వైస్సార్సీపీ జిల్లా
అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ
స్థానాల్లో గెలిచిందన్నారు. టీడీపీ ముందుగానే పీడీఎఫ్ తో ఒప్పందం చేసుకున్న
అంశాన్ని గుర్తు చేసారు. సహజంగా కమ్యూనిస్టులు, వారి అనుబంధ యూనియన్లు
యాక్టివ్గా ఉంటాయన్నారు. పీడీఎఫ్ తెలుగుదేశం పార్టీకి రెండో ప్రాధాన్యత
ఓట్లను బదిలీ చేసిందని చెప్పారు. ఈ ఫలితాలను చూసి ఎవరూ సంబరాలు చేసుకోవాల్సిన
అవసరం లేదన్నారు.