గుంటూరు : అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జన సేన అధ్యక్షుడు
పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు,
వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రాథమిక అంచనా మేరకు 2 లక్షల
ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి అని క్షేత్ర స్థాయి సమాచారం ద్వారా
తెలిసిందన్నారు. ఇప్పటికే రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
ప్రధానంగా కౌలు రైతులు అప్పులతో సతమతమవుతున్నారని, ఈ సమయంలో వడగండ్లతో కూడిన
వర్షాలు వారిని మరింత కుంగదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి తక్షణ
ఆర్థిక సాయంతోపాటు పంట నష్ట పరిహారాన్ని సత్వరమే అందించాలని విజ్ఞప్తి చేశారు.
పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతుల బాధలు నా దృష్టికి వచ్చాయని, కళ్ళాల మీద పంట
నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారన్నారు. ఈ దఫా ధర
పెరుగుతోందని ఆశపడ్డ రైతులకు ఆవేదనే మిగిలిందని, ఉమ్మడి కర్నూలు, అనంతపురం
జిల్లాల్లోని మిర్చి రైతులు సైతం నష్టపోయారన్నారు. అదే విధంగా ఉమ్మడి కృష్ణా,
పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మామిడి, మొక్క జొన్న, పొగాకు రైతులు కూడా దెబ్బ
తిన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల మీద
ఆధారపడ్డ రైతులకు ఈ అకాల వర్షాలు, గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని, అరటి,
మొక్కజొన్న, కర్బూజ, బొప్పాయి లాంటి పంటలు దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో వరి రైతులు తమ పంట అమ్ముకొనే సమయంలో వర్షాలతో నష్టాల
పాలయ్యారని, ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని
ఆదుకొనే విషయంలో ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.
పంట నష్టాల గణాంకాలను పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా నమోదు చేయాలని
అధికారులను కోరారు మా పార్టీ నాయకులకు సైతం క్షేత్ర స్థాయిలో పంటలు నష్టపోయిన
రైతులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సూచించానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.