పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వా.. నేనా?
మొత్తంగా పోలైన ఓట్లు 2,45,687
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఉత్కంఠ పోరు కొనసాగుతోంది. వైసీపీ, తెలుగుదేశం పార్టీల అభ్యర్థుల మధ్య
హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి
రౌండ్లోనూ టీడీపీ , వైసీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా
పోటీ నడుస్తోంది. అనంతపురం జేఎన్టీయూలో గురువారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
శనివారం కూడా కొనసాగుతోంది. 11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
పూర్తి కాగా మొత్తంగా 2,45,687 ఓట్లు పోలైనట్టు గుర్తించారు. వీటిలో 2,26,405
ఓట్లు చెల్లుబాటు అయినట్టు తేల్చారు. మొత్తం ఓట్లలో 19,239 ఓట్లు చెల్లనివిగా
పరిగణించారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపునకు కావాల్సిన
ఓట్లు రాకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును
కొనసాగిస్తున్నారు. ఈ స్థానంలో మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం
2,26,405 ఓట్లలో 50శాతంతో పాటు అదనంగా మరో ఓటు అంటే 1,13,204 ఓట్లు సాధించిన
అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు.
అభ్యర్థుల విజయానికి కావాల్సిన ఓట్ల కోసం కనిష్ఠ ఓట్లు సాధించిన అభ్యర్థుల
రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ వస్తున్నారు. రెండో ప్రాధాన్యతా ఓట్ల
లెక్కింపులో ఇప్పటివరకు 33 మంది అభ్యర్థుల ఓట్ల లెక్కింపును సిబ్బంది పూర్తి
చేశారు. వీరి బ్యాలెట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత
వైసీపీ అభ్యర్థికి 96,436 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 94,717 ఓట్లు
వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో తెదేపా బలపరిచిన అభ్యర్థి కంటే
వైసీపీ అభ్యర్థి కేవలం 1719 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. తొలి ప్రాధాన్యత
ఓట్లు పూర్తయ్యే సరికి ఉన్నప్పటి కంటే వైసీపీ అభ్యర్థి మెజార్టీ క్రమంగా
తగ్గుతూ వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు పీడీఎఫ్ అభ్యర్థికి 19,088 ఓట్లు
రాగా బీజేపీ అభ్యర్థికి 7,510 ఓట్లు వచ్చాయి.